ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో ఓ కోతి మహిళ చేతిలోని డబ్బుల బ్యాగ్‌ను లాక్కుని వెళ్లిన వింత ఘటన, ఆ తర్వాత పోలీసులు తమ సమయస్ఫూర్తితో ఆ నగదును స్వాధీనం చేసుకున్న తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అయోధ్యలోని సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన అంజు దేవి వద్ద ఉన్న రూ.42,105 నగదు బ్యాగ్‌ను ఓ కోతి హఠాత్తుగా లాక్కొని సమీపంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ మహిళ నగదును తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కోతి ఇవ్వకపోవడంతో ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా నిల్చుండిపోయింది.
ఈ సమాచారం అందిన వెంటనే కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు అశోక్ కుమార్, పంకజ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ కుల్దీప్ యాదవ్, కానిస్టేబుల్ అంకిత్‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కోతిని బెదిరించినా లేదా బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించినా అది డబ్బును ఎక్కడైనా విసిరేయడం లేదా చింపివేసే ప్రమాదం ఉందని పోలీసులు గ్రహించారు. దీంతో వారు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. కోతికి ఓ అరటిపండును చూపిస్తూ దాని దృష్టిని మళ్లించారు. ఆ కోతి అరటిపండు తినడంలో నిమగ్నమైన సమయంలో, పోలీసులు ఎంతో నేర్పుగా వ్యవహరించి దాని వద్ద ఉన్న నగదును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మొత్తాన్ని సరిచూసి బాధితురాలికి అప్పగించారు.
పోలీసులు బలప్రయోగం చేయకుండా తమ సమయోచిత బుద్ధితో సమస్యను సులభంగా పరిష్కరించిన తీరుపై స్థానిక ప్రజలు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
