కోమాలో మొజ్తబా ఖమేనీ? ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కథ ముగించిన అమెరికా – ఇజ్రాయెల్? షాకింగ్ వివరాలు

టెహ్రాన్: అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన కాళ్లను కోల్పోయారని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని బ్రిటీష్ పత్రిక ‘ది సన్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.

గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన మధ్యంతర ప్రభుత్వ నేతలను కూడా అమెరికా కూటమి మట్టుబెట్టింది. ఈ క్రమంలోనే అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యారు.

లివర్, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు:
బ్రిటీష్ పత్రిక నివేదిక ప్రకారం.. మొజ్తబా ఖమేనీ అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పొట్ట మరియు కాలేయ భాగం ఛిద్రమైందని, టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర చికిత్స అందుతోందని సమాచారం. ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి, సీనియర్ సర్జన్ అయిన మహమ్మద్ రెజా జాఫర్‌కండి పర్యవేక్షణలో ఈ చికిత్స జరుగుతోంది. ఆయనకు అత్యంత కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు.

కాళ్లు తొలగింపు?
ఫిబ్రవరి 28న తన తండ్రి మరణించిన అదే దాడిలో మొజ్తబా గాయపడ్డారా లేదా అనేది స్పష్టంగా తెలియదు. కానీ, ప్రస్తుతం ఆయన ఇరాన్ యుద్ధ వ్యూహాలను నడిపించే స్థితిలో లేరని తెలుస్తోంది. టెహ్రాన్‌కు చెందిన ఒక వ్యక్తి సమాచారం ప్రకారం.. మొజ్తబా ఖమేనీకి ఒకటి లేదా రెండు కాళ్లను తొలగించారని, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కోమాలోకి వెళ్లారని తెలుస్తోంది.

బయటకు రాని ఫోటోలు:
ఇరాన్ ప్రభుత్వం ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే, దేశ ప్రజలను ఉద్దేశించి మొజ్తబా నేరుగా టీవీలో ప్రసంగిస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన ప్రత్యక్షంగా కనిపించకుండా కేవలం ఒక లేఖను మాత్రమే టీవీ న్యూస్ రీడర్ ద్వారా చదివి వినిపించారు. దీంతో నిజంగానే మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారా? అన్న సందేహాలు అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఇరాన్ నాయకత్వంలో మళ్ళీ శూన్యం ఏర్పడి యుద్ధం మరింత తీవ్రం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


Posted

in

by

Tags: