టెహ్రాన్: అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన తన కాలును కోల్పోయి ప్రస్తుతం కోమాలోకి వెళ్లారని ఒక బ్రిటిష్ పత్రిక వెల్లడించిన వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వ నేతలను కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఈ క్రమంలో అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపిక చేశారు.
బ్రిటిష్ పత్రిక కథనం
బ్రిటిష్ దినపత్రిక ‘ది సన్’ కథనం ప్రకారం.. మొజ్తబా ఖమేనీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఆయనకు పొట్ట మరియు కాలేయ భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి, ప్రముఖ సర్జన్ మహ్మద్ రెజా జాఫర్కండి పర్యవేక్షణలో భారీ భద్రత మధ్య ఆయనకు చికిత్స జరుగుతోంది.
కోమాలో ఉన్నట్లు సమాచారం..
ఫిబ్రవరి 28న తన తండ్రి మరణించిన అదే దాడిలో మొజ్తబా గాయపడ్డారా లేక తర్వాతి దాడుల్లోనా అనే దానిపై స్పష్టత లేదు. అయితే, ప్రస్తుతం ఆయన ఇరాన్ యుద్ధ వ్యూహాలను పర్యవేక్షించడం లేదు. టెహ్రాన్‌కు చెందిన ఒక వ్యక్తి సమాచారం ప్రకారం.. “మొజ్తబా ఖమేనీకి ఒకటి లేదా రెండు కాళ్లు తొలగించాల్సి వచ్చింది. కాలేయం, పొట్ట భాగాలు చిద్రమయ్యాయి. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారు” అని తెలుస్తోంది.
ప్రభుత్వం మౌనం – పెరుగుతున్న అనుమానాలు
మొజ్తబా ఆరోగ్యంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన తొలిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అంతా భావించారు. కానీ, ఆయన స్వయంగా టీవీలో కనిపించకుండా, కేవలం ఆయన పేరుతో ఉన్న ఒక ప్రకటనను (Statement) మాత్రమే వార్తా వ్యాఖ్యాత చదివి వినిపించారు. ఇది ఆయన కోమాలో ఉన్నారనే వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
