కోయంబత్తూరు: మద్యానికి బానిసైన భర్త వేధింపులు భరించలేక ఓ భార్య తీసుకున్న విపరీత నిర్ణయం ఇప్పుడు ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. మద్యం తాగేందుకు డబ్బుల కోసం రోజూ వేధించే భర్తను, సదరు భార్య చివరకు కడతేర్చిన ఘటన కోయంబత్తూరు జిల్లా అన్నూరు సమీపంలోని మూక్కనూరు గ్రామంలో చోటుచేసుకుంది.
ఏం జరిగింది?
ఈ గ్రామానికి చెందిన 38 ఏళ్ల రమేష్ వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. అతనికి మద్యం అలవాటు ఉండటంతో, నిత్యం భార్య శశిప్రియతో గొడవ పడేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను వేధించడం అతనికి అలవాటుగా మారింది.
ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన రాత్రి 2 గంటల సమయంలో రమేష్ ఇంటి బయట కూర్చుని మద్యం సేవించడం ప్రారంభించాడు. తెల్లవారే వరకు తాగుతూనే ఉండి, మరింత మద్యం కోసం శశిప్రియను డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పిన ఆమెపై రమేష్ విచక్షణారహితంగా దాడి చేశాడు.
అసహనంతో హత్య
భర్త వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతుండటం, ఆ రోజు జరిగిన దాడితో తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురైన శశిప్రియ ఒక్కసారిగా రెచ్చిపోయింది. తన మెడలోని దుప్పటాను తీసి రమేష్ మెడకు చుట్టి గట్టిగా బిగించింది. అంతేకాకుండా, అతని ముక్కు, నోరు మూసి పక్కనే ఉన్న మంచంపైకి నెట్టడంతో, శ్వాస ఆడక రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అబద్ధాలతో బురిడీ.. చివరకు పోలీసులకు చిక్కులు
భర్త చనిపోయినట్లు నిర్ధారించుకున్న శశిప్రియ, ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. రమేష్ సోదరుడు కార్తికేయన్‌కు ఫోన్ చేసి, “రమేష్‌కు అకస్మాత్తుగా ఆరోగ్యం బాలేదు, వెంటనే రండి” అని ఏడుస్తూ చెప్పింది. కార్తికేయన్ వెంటనే అక్కడికి చేరుకుని చూడగా, మంచం కింద రమేష్ అచేతనంగా పడి ఉన్నాడు.
వెంటనే అతడిని మూక్కనూరు ఆరోగ్య కేంద్రానికి తరలించగా, మెడపై ఉన్న గీతలు, గాయాలను గమనించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం అన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కానీ, అక్కడ పరీక్షించిన వైద్యులు రమేష్ అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారు.
కేసు నమోదు.. అరెస్ట్
ప్రారంభంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, కార్తికేయన్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో శశిప్రియ తన తప్పును ఒప్పుకుంది. మద్యం కోసం తనను నిత్యం వేధించేవాడని, ఆ రోజు జరిగిన దాడితో సహనం కోల్పోయి చంపేశానని అంగీకరించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
