వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ప్రజలు ఈ భయం నుండి కోలుకుని ఇప్పుడిప్పుడే సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో కోవిడ్ తరహాలోనే చికిత్స లేని ఒక రహస్య వైరస్ వేగంగా వ్యాపిస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న ‘జెఫెర్సన్ హెల్త్’ ఇన్ఫెక్షన్ నివారణ విభాగం శాస్త్రవేత్తలు ఈ షాకింగ్ వివరాలను వెల్లడించారు.
అడెనోవైరస్ అంటే ఏమిటి? జెఫెర్సన్ హెల్త్ మెడికల్ డైరెక్టర్ ఎరిక్ సచిన్వాలా మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘అడెనోవైరస్’ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. దీని లక్షణాలు సాధారణ జలుబు లేదా కోవిడ్ మాదిరిగానే ఉన్నప్పటికీ, దీనికి చికిత్స చేసే మార్గాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వైరస్ తీవ్రత మరియు లక్షణాలు:
- మొండి వైరస్: సాధారణ వైరస్ల కంటే ఇది చాలా శక్తివంతమైనది. సోపు, నీరు లేదా సాధారణ శానిటైజర్లతో ఇది త్వరగా నశించదు. దీనివల్ల ఇది వాతావరణంలో ఎక్కువ కాలం జీవించి, ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది.
- లక్షణాలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, గొంతు నొప్పి దీని ప్రధాన లక్షణాలు. దీనితో పాటు విరేచనాలు లేదా కళ్లు ఎర్రబడటం (Pink Eye) కూడా జరగవచ్చు. ఈ వైరస్‌లో దాదాపు 60కి పైగా రకాలు ఉన్నందున, ఒక్కొక్కరిలో లక్షణాలు ఒక్కోలా ఉండవచ్చు.
- ఎవరికి ప్రమాదం: సాధారణ ఆరోగ్యవంతుల్లో ఇది స్వల్ప లక్షణాలతో తగ్గిపోయినప్పటికీ.. వృద్ధులు, గర్భిణీలు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది ప్రాణాంతకంగా మారవచ్చు.
ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి? జ్వరం 40 డిగ్రీల సెల్సియస్ (104°F)కు చేరుకుంటే అది తీవ్రమైన స్థితిగా భావించాలి. సాధారణంగా రెండు రోజుల తర్వాత లక్షణాలు తగ్గాలి, కానీ మూడు రోజులైనా తగ్గకపోతే అది ప్రమాదకర సంకేతం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో భారత్ సహా ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీనికి సరైన మందులు లేనందున, ఇది కోవిడ్ లాగా విజృంభిస్తే ప్రపంచం మరో భారీ విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
