క్రూరత్వానికి పరాకాష్ట.. కరువుతో అలమటిస్తున్న 1,000 మంది ఊచకోత… ఉరితీసి చంపిన పారామిలిటరీ దళాలు!

సూడాన్‌లోని డార్ఫర్ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న శరణార్థి శిబిరాన్ని ఒక పారామిలిటరీ బృందం స్వాధీనం చేసుకుని, 1,000 మందికి పైగా పౌరులను పొట్టనబెట్టుకున్న దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగింది?

డార్ఫర్‌లోని జమ్జామ్ (Zamzam) శరణార్థి శిబిరంలో అంతర్యుద్ధం కారణంగా నిరాశ్రయులైన దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. ఏప్రిల్ 11 నుండి 13 మధ్య, సూడాన్ పారామిలిటరీ దళం (Rapid Support Forces – RSF) ఈ శిబిరాన్ని ఆక్రమించుకుంది. ఈ క్రమంలో ఆకలితో అలమటిస్తున్న సుమారు 1,000 మందిని అత్యంత క్రూరంగా చంపినట్లు ఐక్యరాజ్యసమితి (UN) మానవ హక్కుల కమిషన్ నివేదిక వెల్లడించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు:
  • ఆహారం అడ్డగింత: శిబిరంలోకి ఆహారం, వైద్య సామాగ్రి రాకుండా పారామిలిటరీ దళాలు అడ్డుకున్నాయి. దీంతో ప్రజలు తినడానికి ఏమీ లేక వేరుశనగ పొట్టు తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారని తెలిసి ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి.
  • క్రూరమైన హత్యలు: శిబిరం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన 319 మందిని బహిరంగంగా ఉరితీశారు. ఒకే గదిలో దాక్కున్న ఎనిమిది మందిని కాల్చి చంపారు.
  • మారణకాండ: హత్యలతో పాటు అత్యాచారాలు, చిత్రహింసలు మరియు కిడ్నాప్‌లకు పాల్పడినట్లు ప్రాణాలతో బయటపడిన వారు వాంగ్మూలం ఇచ్చారు.
  • UN నివేదిక: జూలై 2025లో 155 మంది బాధితులు ఇచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ 18 పేజీల సమగ్ర నివేదికను విడుదల చేశారు.
చారిత్రక నేపథ్యం:

2003లో డార్ఫర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు అల్-ఫాషిర్ నగరానికి 15 కి.మీ దూరంలో ఈ జమ్జామ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 2023లో జరిగిన హింస కారణంగా ఆఫ్రికన్ గిరిజన తెగలకు చెందిన వేలాది మంది ప్రజలు ఈ శిబిరానికి తరలివచ్చారు. గత ఏడాది చివరి నుండి ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారాయి.


Posted

in

by

Tags: