న్యూఢిల్లీ: మీరు షాపింగ్ లేదా బిల్లుల చెల్లింపుల కోసం తరచుగా క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఏప్రిల్ 1, 2026 నుండి క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి ఐదు ప్రధాన నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ఈ మార్పులతో ప్రభుత్వం మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులపై నిశిత దృష్టి సారించనుంది.
1. ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? లెక్క చెప్పాల్సిందే! ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులు చేస్తే అప్రమత్తంగా ఉండండి. బ్యాంకులు ఈ సమాచారాన్ని నేరుగా ఆదాయపు పన్ను (IT) శాఖకు నివేదిస్తాయి. అంతేకాకుండా, అంతర్జాతీయ ప్రయాణాల కోసం మీరు చేసే భారీ ఖర్చులు కూడా ఇకపై నిఘాలో ఉంటాయి.
2. ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు: మీరు ట్యాక్స్ రిటర్న్స్‌లో (ITR) ప్రకటించిన ఆదాయం కంటే, మీ వార్షిక ఖర్చులు గణనీయంగా ఎక్కువగా ఉంటే.. ఆ నిధుల మూలం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించవచ్చు. దీనికి సంబంధించి మీరు అధికారిక నోటీసును కూడా అందుకునే అవకాశం ఉంది.
3. పాన్ కార్డ్ లేకపోతే ఇబ్బందే: ఏప్రిల్ 1 నుండి క్రెడిట్ కార్డ్ మరియు పాన్ (PAN) కార్డ్ అనుసంధాన నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. చెల్లుబాటు అయ్యే పాన్ నంబర్ లేకుండా ఏ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డ్‌ను జారీ చేయదు. ఇప్పటికే కార్డ్ ఉన్నవారు కూడా తమ కార్డును పాన్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చేసే ప్రతి చిన్న, పెద్ద ఖర్చు ఇకపై మీ ట్యాక్స్ ప్రొఫైల్‌తో ముడిపడి ఉంటుంది.
4. వ్యక్తిగత షాపింగ్ కోసం ఆఫీస్ కార్డ్ వాడితే మూల్యం తప్పదు: చాలా మంది తమ కంపెనీల నుండి కార్పొరేట్ క్రెడిట్ కార్డులను పొందుతుంటారు. ఇప్పటివరకు వీటిని అధికారిక పనులతో పాటు అప్పుడప్పుడు వ్యక్తిగత ఖర్చుల కోసం కూడా వాడుతుండేవారు. అయితే, ఇకపై మీ కంపెనీ కార్డును వ్యక్తిగత షాపింగ్, సినిమా టిక్కెట్లు లేదా పర్సనల్ ట్రిప్స్ కోసం వాడితే, ప్రభుత్వం ఆ ఖర్చును మీ ‘అదనపు ఆదాయం’గా పరిగణిస్తుంది (దీనిపై పన్ను పడే అవకాశం ఉంది).
5. క్రెడిట్ కార్డ్ ద్వారా ఆదాయపు పన్ను చెల్లింపు: ఇకపై నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ అవసరం లేకుండా నేరుగా క్రెడిట్ కార్డ్ ద్వారా మీ ఆదాయపు పన్నును చెల్లించవచ్చు. పన్ను కట్టే సమయంలో మీ వద్ద నగదు కొరత ఉంటే, కార్డ్ ద్వారా చెల్లించి ఆ తర్వాత బ్యాంకుకు వాయిదాల పద్ధతిలో (EMI) చెల్లించవచ్చు. అయితే, దీనికి బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయవచ్చు. సకాలంలో బిల్లు చెల్లించకపోతే భారీ వడ్డీ పడుతుందని గుర్తుంచుకోండి.
అదనపు వెసులుబాటు – అడ్రస్ ప్రూఫ్: మీ వద్ద కరెంట్ బిల్లు లేదా ఇతర నివాస ధృవీకరణ పత్రాలు లేకపోతే, మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఇకపై చెల్లుబాటు అయ్యే అడ్రస్ ప్రూఫ్ (చిరునామా ధృవీకరణ)గా ఉపయోగించవచ్చు. కొత్త పాన్ కార్డ్ దరఖాస్తుకు లేదా అప్‌డేట్ కోసం దీనిని సమర్పించవచ్చు.
