బెంగళూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లా నుంచి గుండెల్ని పిండేసే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని మొండికేసిన 17 ఏళ్ల కూతురిని జన్మనిచ్చిన తండ్రే దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సదరు తండ్రి స్వయంగా అదృశ్యమయ్యాడు. అయితే, నెల రోజుల తర్వాత పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించి నిందితుడికి బేడీలు వేశారు.
ప్రేమ వ్యవహారానికి తీవ్ర వ్యతిరేకత అరెస్ట్ అయిన నిందిత రైతు పేరు తిమ్మరాయప్ప (వయస్సు 48). ఇతడు సిరా తాలూకాలోని నింబేమరాదహళ్లి నివాసి. అతని 17 ఏళ్ల కుమార్తె టి. మేఘన.. తన తల్లికి వరుసకు దగ్గరి బంధువైన ఒక ఎలక్ట్రీషియన్ యువకుడిని ప్రేమించింది. మేఘన తల్లికి వీరి ప్రేమ ఇష్టమే అయినప్పటికీ, తండ్రి తిమ్మరాయప్ప మాత్రం ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ వివాదమే చివరకు దారుణ హత్యకు దారితీసింది.
పొలానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య ఏప్రిల్ 16న తిమ్మరాయప్ప మేఘనను తమ పొలానికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆమె ప్రేమ వ్యవహారంపై ఇద్దరి మధ్య మళ్లీ తీవ్రమైన వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన తిమ్మరాయప్ప కన్నకూతురి గొంతు నులిమి అక్కడికక్కడే హతమార్చాడు.
సాక్ష్యాధారాల నిర్మూలనకు మొదట బావిలో.. ఆపై తవ్వకాల్లో.. కూతురు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, తిమ్మరాయప్ప మృతదేహాన్ని పొలంలోని బావిలో పడేశాడు. అయితే, మృతదేహం నీటిపై తేలితే తన పాపం పగిలిపోతుందని అతడు భయపడ్డాడు. అందువల్ల అదే రోజు సాయంత్రం బావిలో నుంచి మేఘన మృతదేహాన్ని మళ్లీ బయటకు తీశాడు. చీకటి పడేవరకు వేచి చూసి, సమీపంలోని ఒక ఎండిపోయిన చెరువు గర్భంలోకి తీసుకెళ్లి మృతదేహాన్ని పాతిపెట్టాడు.
పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం హత్య చేసిన మరుసటి రోజే అతడు భార్యతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వారం రోజులకు, అంటే ఏప్రిల్ 23న అతడు స్వయంగా కొంత డబ్బు, బైక్ తీసుకుని ఇంటి నుంచి మాయమయ్యాడు. భర్త, కూతురు ఇద్దరూ కనిపించకుండా పోవడంతో భయాందోళనకు గురైన భార్య మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముందస్తు బెయిల్ కోసం స్నేహితుడిని అడగబోయి.. పోలీసుల చిక్కాడు ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిపోవడంతో పోలీసులకు ఈ దర్యాప్తు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, మే 15న పోలీసులకు ఒక రహస్య సమాచారం అందింది. తిమ్మరాయప్ప తన గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్నేహితుడిని కలవడానికి వచ్చాడని తెలిసింది. పోలీసులు విచారించగా, అతడు పోలీసుల కళ్లు గప్పి వేర్వేరు తాలూకాల్లో బైక్పై తిరుగుతున్నాడని, రాత్రి పూట దేవాలయాలు లేదా బస్ స్టాండ్లలో నిద్రిస్తున్నాడని తెలిసింది. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. అతడు తన స్నేహితుడి వద్దకు వెళ్లి “హత్య కేసులో ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఎలా పొందాలో?” అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
తిమ్మరాయప్ప కడబాగేరిలోని ఒక దుకాణం నుంచి కొత్త సిమ్ కార్డు, ఒక పాత మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఆ స్నేహితుడు తిమ్మరాయప్ప కొత్త మొబైల్ నంబరును పోలీసులకు అందించాడు. అదే సమయంలో అతడు సొంత గ్రామం పరిసరాల్లోనే ఉన్నట్లు జియో-లొకేషన్ ద్వారా స్పష్టమైంది. శనివారం పోలీసులు తిమ్మరాయప్పను అదుపులోకి తీసుకున్నారు. మొదట తాను అమాయకుడినని నటించినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో కన్నకూతురిని హత్య చేసినట్లు అంగీకరించాడు.
