భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్లో ఒక మహిళపై ఆమె స్నేహితుడు మరియు అతని ముగ్గురు స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. నిందితులు బాధితురాలికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత క్షణాలను ఫోటోలు లేదా వీడియోలు కూడా తీసినట్లు ఇన్ఫో వ్యాలీ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
నలుగురు నిందితులను భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
బాధితురాలు సుమారు 20 రోజుల క్రితం తన పురుష మిత్రుడి ఆహ్వానం మేరకు అతని గదికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆమె స్నేహితుడు మరియు అతని ముగ్గురు స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, మొబైల్ ఫోన్ ద్వారా వీడియో చిత్రీకరించారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై బాధితురాలు మంగళవారం ఇన్ఫో వ్యాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. “బాధితురాలి ఫిర్యాదు అందిన వెంటనే మేము నలుగురు నిందితులను అరెస్టు చేశాము” అని పోలీసు అధికారి తెలిపారు.
