భారతదేశంలో హిందీ భాషా పాత్రపై చర్చలు జరుగుతున్న తరుణంలో, గయానా పార్లమెంటులో హిందీ గంభీరంగా వినిపించింది. గయానా బడ్జెట్ 2026 చర్చల సందర్భంగా, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి వికాష్ రాంకిసూన్ తన హిందీ ప్రావీణ్యాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులకు అదే భాషలో అనర్గళంగా సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పార్లమెంటులో అసలేం జరిగింది? బడ్జెట్ చర్చల సమయంలో ఒక ప్రతిపక్ష సభ్యుడు వికాష్ను ఉద్దేశించి “నీకు అసలు హిందీ మాట్లాడటం వచ్చా?” అని ఎద్దేవా చేశారు. దానికి ఏమాత్రం తడబడకుండా వికాష్ రాంకిసూన్ హిందీలోకి మారి ఇలా సమాధానం ఇచ్చారు:
“గౌరవనీయులైన సభాధ్యక్షా, నాకు హిందీ రాదని ఎవరైతే అనుకుంటున్నారో, వారితో నేను హిందీలోనే చర్చకు సిద్ధం. వారికి నేను సవాల్ విసురుతున్నాను – అంశం ఏదైనా వారు ఎంచుకోమనండి, నేను ఎటువంటి కాగితాలు (నోట్స్) లేకుండా ఇప్పుడే చర్చలో పాల్గొంటాను.”
ఆయన ఆత్మవిశ్వాసంతో ఇచ్చిన ఈ సమాధానం సభలో అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. గయానాలోని భారత హైకమిషన్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, “మా హిందీ గయానా పార్లమెంటులో ప్రతిధ్వనించింది” అని గర్వంగా పేర్కొంది.
గయానాలో భారతీయ మూలాలు: గయానా జనాభాలో సుమారు 40% మంది భారతీయ సంతతికి (Indo-Guyanese) చెందినవారే. 1838 మరియు 1917 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ప్రాంతాల నుండి దాదాపు 2.39 లక్షల మంది భారతీయులు ఒప్పంద కార్మికులుగా అక్కడికి వెళ్లారు. తరాలు మారినా వారు తమ సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. గయానా అధికారిక భాష ఇంగ్లీష్ అయినప్పటికీ, హిందీ మరియు భోజ్పురి భాషలను అక్కడ నేటికీ గౌరవిస్తారు.
