హెల్త్ డెస్క్: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో బిడ్డ ఎదుగుదలకు, తల్లి ఆరోగ్యానికి రకరకాల విటమిన్లు అవసరమవుతాయి. అయితే చాలామంది విస్మరించే విటమిన్ ‘బి1’ (థయామిన్). దీని లోపం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యాలపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు బి1 ఎందుకు అవసరం? అది లోపిస్తే వచ్చే ముప్పులేంటి? బెంగళూరులోని కిండర్ మహిళా ఆస్పత్రి సీనియర్ గైనకాలజిస్ట్ డో. శ్రీజారాణి వెల్లడించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
థయామిన్ (బి1) పాత్ర ఏంటి?
విటమిన్ బి1 అనేది నీటిలో కరిగే విటమిన్. మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా:
- నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తుంది.
- గుండె మరియు కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
- శరీరంలోని జీవక్రియల ప్రక్రియలో (Metabolism) తోడ్పడుతుంది.
లోపానికి కారణాలు.. లక్షణాలు ఏంటి?
సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం వల్ల ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో విపరీతమైన వాంతులు (Hyperemesis Gravidarum) అయ్యే మహిళల్లో బి1 లోపించే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
- లక్షణాలు: నిరంతర అలసట, ఆకలి మందగించడం, చిరాకు, కాళ్లు చేతులు మొద్దుబారడం. తీవ్రమైన సందర్భాల్లో నాడీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.
ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు
థయామిన్ లోపం వల్ల తల్లిలో గుండె సంబంధిత, నాడీ మరియు మానసిక సమస్యలు రావచ్చు. ఇది పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తుంది. బిడ్డకు శ్వాసకోశ, గుండె మరియు జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల ‘బెరిబెరి’ వంటి ప్రమాదకర వ్యాధులు సోకే అవకాశం ఉంది.
ఏం తినాలి? ఎలా నివారించాలి?
విటమిన్ బి1 పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకోవాలి:
- ధాన్యాలు: ముడి బియ్యం, తృణధాన్యాలు.
- పప్పు ధాన్యాలు: పెసలు, మినుములు, సోయాబీన్స్.
- గింజలు: బాదం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు గింజలు.
- మాంసం: కొవ్వు తక్కువగా ఉండే మాంసం (Lean Meat).
