నవగ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు) మన జీవితంలోని అడ్డంకులను తొలగించి శుభ ఫలితాలను ఇచ్చే తొమ్మిది గ్రహాలు. నవగ్రహాల అనుగ్రహం ప్రతి ఒక్కరికీ అవసరం. గ్రహ దోషాలు తొలగి యోగం పట్టాలంటే ఆయా గ్రహాలకు సంబంధించిన రోజుల్లో సరైన వస్త్రం, పుష్పాలు మరియు నవధాన్యాలతో 7 లేదా 9 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
అయితే, చాలామంది భక్తులు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. నవగ్రహాలను దర్శించుకునేటప్పుడు చేయకూడని పనులు ఇవే:
వరుస క్రమం: గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ మొదట వినాయకుడిని, తర్వాత మూలవిరాట్టును దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహాల వద్దకు వెళ్ళాలి. నేరుగా నవగ్రహాల దగ్గరికి వెళ్లి పరిహారాలు చేయకూడదు.
శని దేవుని దర్శనం: శని భగవానుడిని పూజించేటప్పుడు ఆయనకు నేరుగా ఎదురుగా నిలబడకూడదు. కాస్త పక్కకు జరిగి నిలబడి నమస్కరించాలి.
ఏకాగ్రత: ఫోన్లో మాట్లాడుతూ లేదా పక్కవారితో కబుర్లు చెబుతూ ప్రదక్షిణలు చేయకూడదు. మనసులో దైవాన్ని స్మరిస్తూ ప్రశాంతంగా ప్రదక్షిణ చేయాలి.
విగ్రహాలను తాకడం: నవగ్రహ విగ్రహాలను చేతులతో గానీ, బట్టలతో గానీ తాకకూడదు. దూరంగా నిలబడే నమస్కరించాలి.
ప్రదక్షిణ దిశ: నవగ్రహాలకు ఎప్పుడూ కుడి వైపు నుంచే (సవ్య దిశలో) ప్రదక్షిణలు చేయాలి. కొందరు రాహు, కేతువుల కోసం 2 సార్లు ఎడమ వైపు తిరుగుతుంటారు, ఇది పూర్తిగా తప్పు. ప్రదక్షిణ పూర్తయ్యాక వెనక్కి తిరిగి చూడకుండా రావాలి.
ప్రదక్షిణల సంఖ్య: శనివారం నాడు 9 సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ప్రతిరోజూ గుడికి వెళ్లేవారు 1 సారి ప్రదక్షిణ చేస్తే చాలు, ప్రతిసారీ 9 సార్లు చేయనవసరం లేదు.
చేతుల భంగిమ: ప్రదక్షిణలు చేసేటప్పుడు చేతులు కట్టుకోకూడదు. చేతులు జోడించి లేదా మామూలుగా ఉంచి ప్రశాంతంగా నడవాలి.
దీపారాధన: నవగ్రహాల వద్ద దీపం పెట్టేటప్పుడు ఇతరులు వాడిన ప్రమిదలను వాడకూడదు. కొత్త ప్రమిదలను కొని వెలిగించడం శ్రేయస్కరం.
శని దోష నివారణ: శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది.
దర్శనం తర్వాత: నవగ్రహ దర్శనం పూర్తయ్యాక కొద్దిసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఆ తర్వాతే ఇంటికి బయలుదేరాలి.
