మనలో చాలా మందికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. గాఢ నిద్రలో మనకు తెలియకుండానే గురక శబ్దం వస్తుంది. ఇది సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి గురక సమస్య అధికంగా ఉన్నవారు ఖచ్చితంగా డాక్టరును సంప్రదించాలి.
గురక పెట్టే వ్యక్తికి దాని వల్ల ఇబ్బంది తెలియదు కానీ, పక్కన పడుకునే వారికి మాత్రం అది నరకంగా మారుతుంది. అలసట, చలికాలంలో ముక్కు మూసుకుపోవడం, గొంతులో కఫం పెరగడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 45 శాతం మందికి గురక సమస్య ఉంటుంది. మార్కెట్లో మందులు ఉన్నప్పటికీ, సహజ పద్ధతుల్లో దీనిని ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు చూద్దాం.
1. పడుకునే పద్ధతి మార్చుకోండి
వెల్లకిలా (వెన్నుపై) పడుకోవడం వల్ల నాలుక మరియు అంగిలి గొంతు వెనుక భాగానికి అంటుకుని శ్వాస తీసుకోవడంలో ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల గురక పెరుగుతుంది. అందుకే ఎడమ వైపుకో లేదా కుడి వైపుకో ప్రక్కకు తిరిగి (Side-sleeping) పడుకోవడం మంచిది. అలాగే రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి.
2. దిండు (Pillow) శుభ్రత
దిండుపై పేరుకుపోయిన ధూళి, మృతకణాలు అలర్జీలకు దారితీసి ముక్కు దిబ్బడ కలిగించవచ్చు. కాబట్టి దిండు గాలి తగిలేలా చూసుకోవాలి మరియు కవర్లను క్రమం తప్పకుండా ఉతకాలి. పడుకునేటప్పుడు తల భాగం కొంచెం ఎత్తులో ఉంటే శ్వాస తీసుకోవడం సులభమై గురక తగ్గుతుంది.
3. కొన్ని ఇంటి చిట్కాలు
- పసుపు మరియు తేనె: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో చెంచా పసుపు, చెంచా తేనె కలిపి పడుకునే ముందు తాగాలి.
- యాలకుల పొడి: గోరువెచ్చని నీటిలో యాలకుల పొడి కలిపి తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.
- పసుపు పాలు: నిద్రకు అరగంట ముందు పసుపు పాలు తాగడం వల్ల శ్వాసనాళాల వాపు తగ్గుతుంది.
- పుదీనా నూనె: గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల పుదీనా నూనె వేసి పుక్కిలించడం వల్ల ముక్కు రంధ్రాల వాపు తగ్గి గాలి సులభంగా ఆడుతుంది.
4. బరువు తగ్గించుకోండి
అధిక బరువు ఉన్నవారిలో గొంతు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల గాలి వెళ్లే దారి సన్నబడి గురక వస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేసి, బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
