గురువు గారు చెప్పిన ఆ ఒక్క మాట అతని మనసునే మార్చేసింది: ఈ కథ చదవండి, మీ మనసు కూడా మారుతుంది

ఒక యువకుడికి జీవితం మీద విరక్తి కలిగింది. దేని మీద ఆసక్తి లేదు, ఒక రకమైన డిప్రెషన్ . ఇంట్లో ఒంటరిగా కూర్చునేవాడు, స్నేహితులతో కలవడం కూడా ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు ఆ ఊరికి ఒక గురువు గారు వచ్చారని అతనికి తెలిసింది. తన సమస్యకు వారి వద్ద ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని ఆలోచించాడు.

యువకుడు గురువు గారి వద్దకు వెళ్లి, “గురువు గారు, నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే ఎప్పుడూ బాధగా ఉంటున్నాను. నేను అందరిలా సంతోషంగా ఎలా ఉండాలి? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి” అని వేడుకున్నాడు.

గురువు గారు యువకుడు చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. కానీ ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్లారు. యువకుడు అయోమయంలో పడ్డాడు. “నేను ఏదో పరిష్కారం దొరుకుతుందని వస్తే, ఈయన ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్లారేంటి?” అని మనసులో అనుకున్నాడు. అంతలో గురువు గారు బయటకు వచ్చారు. ఆయన ఒక చేతిలో గ్లాసు నీళ్లు, మరో చేతిలో ఉప్పు డబ్బా పట్టుకున్నారు.

“నాయనా.. ఈ డబ్బాలో నుండి ఒక పిడికెడు ఉప్పు తీసి గ్లాసు నీళ్లలో వేయి” అన్నారు. యువకుడు అలాగే చేశాడు. ఉప్పు నీళ్లలో కరిగిపోయింది. గురువు గారు “ఆ నీటిని తాగు” అన్నారు. యువకుడికి ఆశ్చర్యం వేసింది, కానీ ఎదురు చెప్పలేక ఒక గుక్క తాగాడు. అంతకంటే ఎక్కువ తాగలేకపోయాడు.

ముఖం చిట్లించిన యువకుడిని గురువు గారు అడిగారు: “నీళ్లు ఎలా ఉన్నాయి నాయనా?” యువకుడు చెప్పాడు: “తాగడం అసాధ్యం గురువు గారు.. అంత ఉప్పగా ఉన్నాయి.” గురువు గారు నవ్వుతూ, “సరే.. ఇప్పుడు ఒక పిడికెడు ఉప్పు తీసుకుని నాతో రా” అని అతడిని ఒక చెరువు వద్దకు తీసుకెళ్లారు.

“నీ చేతిలో ఉన్న ఉప్పును ఈ చెరువులో వేయి” అన్నారు. యువకుడు వేశాడు. “ఇప్పుడు ఈ చెరువు నీటిని దోసిలితో తాగు” అన్నారు. యువకుడు తాగాడు. “నీళ్లు ఎలా ఉన్నాయి?” అని గురువు గారు అడిగారు. “చాలా బాగున్నాయి గురువు గారు” అన్నాడు యువకుడు. “ఉప్పగా ఏమైనా అనిపించాయా?” అని అడిగితే, “లేదు గురువు గారు, చాలా తీయగా (మంచిగా) ఉన్నాయి” అని యువకుడు సమాధానమిచ్చాడు.

గురువు గారు చెరువు పక్కన యువకుడిని కూర్చోబెట్టుకుని, అతని చేయి పట్టుకుని ఇలా చెప్పారు: “నాయనా.. జీవితంలో బాధ అనేది ‘ఉప్పు’ లాంటిది. అది ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఉప్పు పరిమాణం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ మనం దేనిలో వేస్తాము అన్న దానిపైనే దాని రుచి మారుతుంది.

కేవలం ఉప్పునే తింటే చేదుగా (కష్టంగా) ఉంటుంది. అదే కొంచెం ఉప్పును పప్పులో, సాంబార్లో, మజ్జిగలో, చట్నీలో వేస్తే అవన్నీ ఎంత రుచిగా ఉంటాయో చూడు. అంటే.. నువ్వు బాధని పట్టుకుని ఒక మూల కూర్చుంటే అక్కడే కృశించిపోతావు. బయట విశాలమైన ప్రపంచం ఉంది, ఈ చెరువు లాగా.. దానితో కలిసి చూడు, నీ బాధ కూడా సంతోషంగా మారిపోతుంది.”

గురువు గారి కాళ్లకు నమస్కరించి బయలుదేరిన యువకుడికి ఒక విషయం గుర్తొచ్చింది.. “ఓహ్! ఈరోజు నా చెల్లెలి పుట్టినరోజు కదా!” అని ఉత్సాహంగా ఇంటికి వెళ్లాడు.


Posted

in

by

Tags: