“గుర్రం ఇంజెక్షన్ వేసుకుంటే పందెంలో గెలవొచ్చా..?” సినిమా పిచ్చితో ప్రాణాలను పణంగా పెట్టిన యువకులు.. ‘గుడ్డు పండిట్’ కాబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వైనం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాలో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లోని ‘గుడ్డు పండిట్’ పాత్రను చూసి ప్రభావితమైన ఇద్దరు యువకులు.. పరుగు పందెంలో గెలవడం కోసం ఏకంగా గుర్రాలకు ఇచ్చే స్టెరాయిడ్ ఇంజెక్షన్‌ను తమ శరీరాల్లోకి ఎక్కించుకున్న ఉదంతం తీవ్ర కలకలం రేపింది.

సైన్యంలో చేరడం కోసం (ఆర్మీ రిక్రూట్‌మెంట్) నిర్వహించిన శిక్షణ పరుగు పందెంలో పాల్గొన్న 16 ఏళ్ల శ్యామ్‌వీర్ సికర్వార్, 22 ఏళ్ల గౌరవ్ అనే ఇద్దరు యువకులు తమ శారీరక సామర్థ్యాన్ని, వేగాన్ని అమాంతం పెంచుకోవాలనే దురాశతో ఈ విపరీత నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రమాదకరమైన ఇంజెక్షన్ వేసుకున్న అనంతరం వారిద్దరూ 6 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. అయితే ప్రాణాలను పణంగా పెట్టి ఇంతటి సాహసానికి ఒడిగట్టినప్పటికీ, వారిలో ఏ ఒక్కరూ కూడా మొదటి స్థానాన్ని సాధించలేకపోయారు.

పరుగు పందెం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే ఇద్దరికీ తీవ్ర అస్వస్థత ఏర్పడి స్పృహతప్పి నేలపై కుప్పకూలిపోయారు. అది చూసి భయాందోళనకు గురైన తోటి అభ్యర్థులు వెంటనే వారిని ఖేరాగఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు (సామాజిక ఆరోగ్య కేంద్రం) తరలించి అత్యవసర చికిత్స అందించారు.

వైద్యుల తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇద్దరు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకోవడంతో ఇంటికి పంపించారు. కాగా, మానవ శరీరానికి తీవ్రమైన ముప్పు కలిగించే, కఠిన నిషేధం ఉన్న గుర్రాల స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఆ యువకులకు ఎలా లభించాయనే కోణంలో ఔషధ నియంత్రణ అధికారులు, పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.


Posted

in

by

Tags: