గువహటిలో సూర్యవంశీ ప్రభంజనం! 15 ఏళ్ల కుర్రాడి దెబ్బకు ‘జోష్’ కోల్పోయిన RCB.. రాయల్స్ ఖాతాలో నాలుగో విజయం!

గువహటి బ్యూరో: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత కచ్చితత్వంతో బౌలింగ్ చేసే జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి కోలుకుని ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూశారు. కానీ, రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం అతడిని అస్సలు లెక్కచేయలేదు! హేజిల్‌వుడ్ వేసిన ఒకే ఓవర్‌లో 19 పరుగులు పిండుకుని, ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లాడు.

ఈ అద్భుత బ్యాటింగ్ సెన్సేషన్ ధాటికి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తయింది. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు బాదిన వైಭవ్ సూర్యవంశీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.

పాయింట్ల పట్టికలో టాప్ గేర్: ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి, 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓటమి పాలైనప్పటికీ, ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. శుక్రవారం గువహటిలోని బార్సపరా స్టేడియంలో జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ మరో 12 బంతులు మిగిలి ఉండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

వైభవ్ ‘వార్’.. ఆర్సీబీ బేజార్! ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) వికెట్‌ను హేజిల్‌వుడ్ తీయగానే ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వైಭవ్ సూర్యవంశీ క్రీజులోకి రావడంతోనే విధ్వంసం మొదలైంది. ఈ సీజన్‌లో రెండోసారి కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. మొత్తం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

గత మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధిపత్యం ప్రదర్శించిన ఈ కుర్రాడు, ఇప్పుడు ఆర్సీబీ ప్రధాన వేగి హేజిల్‌వుడ్‌ను టార్గెట్ చేశాడు. ఆస్ట్రేలియా పేసర్ వేసిన ఒకే ఓవర్‌లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 19 పరుగులు రాబట్టాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి రెండో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికే రాజస్థాన్ 97 పరుగులు సాధించడంతో ఆర్సీబీ ఆత్మరక్షణలో పడిపోయింది. వైభవ్ అవుటైన తర్వాత ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్), రవీంద్ర జడేజా (24) మిగిలిన పనిని పూర్తి చేశారు.

పోరాడిన రజత్ పాటిదార్: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి కెప్టెన్ రజత్ పాటిదార్ అండగా నిలిచాడు. వికెట్లు పడుతున్నా వెనక్కి తగ్గకుండా 40 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ చివరి ఓవర్‌లో 21 పరుగులు పిండుకోవడంతో ఆర్సీబీ స్కోరు 200 మార్కును దాటింది.

సంక్షిప్త స్కోర్లు:

  • ఆర్సీబీ: 20 ఓవర్లలో 201/8 (పాటిదార్ 63, కోహ్లీ 32, వెంకటేష్ అయ్యర్ 29; ఆర్చర్ 2/33, బిష్ణోయ్ 2/32).
  • రాజస్థాన్ రాయల్స్: 18 ఓవర్లలో 202/4 (ధ్రువ్ జురెల్ 81*, వైభవ్ సూర్యవంశీ 78, జడేజా 24; హేజిల్‌వుడ్ 2/44, కృనాల్ పాండ్య 2/30).


Posted

in

by

Tags: