ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి నెల రోజులు దాటింది. రోజురోజుకూ యుద్ధం తీవ్రతరమవుతోంది. మరోవైపు, డాలర్ బలోపేతం కావడంతో యుద్ధ సమయంలోనూ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా తీసుకున్న ఒక నిర్ణయం బంగారు మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రష్యా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం నాలుగేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, రష్యా ఆర్థిక పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. 25 ఏళ్లలో మొదటిసారిగా రష్యా తన సెంట్రల్ బ్యాంక్ నిల్వల (Gold Reserves) నుండి బంగారాన్ని విక్రయించడం ప్రారంభించిందని ‘bne IntelliNews’ వార్తా సంస్థ సంచలన కథనాన్ని వెలువరించింది.
యుద్ధం ఖర్చు అపారం.. ఖజానాపై భారం: ఉక్రెయిన్‌తో యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో రష్యా సైనిక ఖర్చులు భారీగా పెరిగాయి. 2026 రక్షణ బడ్జెట్ కోసం రష్యా 14.5 ట్రిలియన్ రూబుల్స్ (ప్రభుత్వ మొత్తం వ్యయంలో దాదాపు 40%) కేటాయించింది. కేవలం పన్నుల ద్వారా ఈ భారీ ఖర్చును భరించడం అసాధ్యం కావడంతో రష్యా తన బంగారు నిల్వలను విక్రయించక తప్పడం లేదు. పాశ్చాత్య దేశాలు రష్యా చమురు మరియు గ్యాస్ అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయి. ఫలితంగా 2025లో రష్యా ద్రవ్య లోటు 3.4 శాతానికి చేరుకుంది.
రికార్డు స్థాయి విక్రయాలు – తగ్గుతున్న నిల్వలు: గణాంకాల ప్రకారం, 2022 నుండి 2025 మధ్య రష్యా 150 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన బంగారం మరియు విదేశీ కరెన్సీని విక్రయించింది. 2026 మొదటి రెండు నెలల్లోనే మరో 35 బిలియన్ డాలర్ల బంగారాన్ని అమ్మేసింది. జనవరిలో 3 లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో 2 లక్షల ఔన్సుల బంగారాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.
విధానంలో పెను మార్పు: గతంలో రష్యా సెంట్రల్ బ్యాంక్ కేవలం కాగితంపైనే బంగారం బదిలీలు చేసేది. కానీ ఇప్పుడు నేరుగా బంగారు బిస్కెట్లను (Gold Bars) మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ భారీ విక్రయాల వల్ల రష్యా బంగారు నిల్వలు గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయికి (74.3 మిలియన్ ఔన్సులు) పడిపోయాయి. ప్రపంచంలో బంగారం ఉత్పత్తి చేసే టాప్ 3 దేశాలలో రష్యా ఒకటి. అలాంటి దేశమే తన నిల్వలను అమ్ముకోవాల్సి రావడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పుగా పరిగణించబడుతోంది. రష్యా వంటి పెద్ద దేశం మార్కెట్లోకి బంగారాన్ని భారీగా సరఫరా చేస్తే, ధరలపై ఒత్తిడి పెరిగి బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
