భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ఖర్చు సెలవు దినాల్లో (హాలిడే సీజన్లలో) విపరీతంగా పెరుగుతుందని చాలామంది చెబుతుంటారు.
ముఖ్యంగా, గోవా లాంటి ప్రదేశాల్లో హోటల్ గదుల అద్దెలు, విమాన ప్రయాణ ఖర్చులు అమాంతం పెరగడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, గోవాకు వెళ్లడం కంటే బాలి లేదా వియత్నాం లాంటి విదేశీ పర్యాటక ప్రదేశాలకు వెళ్లడమే ఎంతో చౌక అని ఓ భారతీయ ప్రయాణికుడు తన అనుభవం ఆధారంగా పోల్చి చెప్పాడు.
ఆ ప్రయాణికుడి సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, పండుగ సీజన్లలో గోవాతో సహా ప్రముఖ భారతీయ పర్యాటక ప్రదేశాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఐదు రోజులు బస చేయడానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంతేకాకుండా, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో దేశీయ విమాన టిక్కెట్ల ధరలు సాధారణం కంటే రెండు, మూడు రెట్లు పెరగొచ్చని ఆయన పేర్కొన్నాడు.
దీనికి భిన్నంగా బాలి, వియత్నాం లేదా థాయ్‌లాండ్‌లోని క్రాబి లాంటి ప్రాంతాల్లోని అదే స్థాయి లగ్జరీ హోటళ్లలో ఐదు రాత్రులు గడపడానికి సుమారు రూ.40,000 నుంచి రూ.60,000 వరకు మాత్రమే ఖర్చవుతుందని తెలిపాడు. విదేశీ విమాన ప్రయాణ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ముందుగానే ప్లాన్ చేసుకుంటే విదేశీ ట్రిప్ మొత్తం ఖర్చు, భారతదేశంలో చేసే లగ్జరీ ట్రిప్‌తో సమానంగా లేదా దాని కంటే తక్కువగా ఉండొచ్చన్నది అతడి అభిప్రాయం.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో భారతదేశంలో హోటళ్ల లభ్యత తక్కువగా ఉండటం కూడా అద్దెలు భారీగా పెరగడానికి ఒక కారణం కావొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, గోవాకు బదులుగా విశాఖపట్నం లాంటి తక్కువ రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లొచ్చని మరికొందరు సూచించారు. ఏదేమైనా, ఈ పోలిక అనేది నిర్దిష్ట ప్రయాణ సమయం, హోటల్ రకంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, వెళ్లే తేదీ, విమాన ఛార్జీలు, బస, ఆహారం తదితర అంశాలను బట్టి వాస్తవ ప్రయాణ ఖర్చు మారుతుంటుంది.

Leave a Reply