ఉడిపికి చెందిన వాటర్ స్పోర్ట్స్ వ్యాపారవేత్త సందీప్ సలాయం (42), గోవాలోని ఒక రిసార్ట్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మంగళూరుకు చెందిన అక్షత (35)ను పోలీసులు బెంగళూరులో పట్టుకున్నారు. సందీప్ మరణించిన విషయం తెలియక అక్షత తన మొబైల్ ఫోన్‌ను ఆన్ చేసి ఉంచడం, ఆమె దొరికిపోవడానికి ప్రధాన మలుపుగా మారింది. ఆ మొబైల్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అక్షత వ్యాపారవేత్త సందీప్‌ను రిసార్ట్‌కు రప్పించి, అతనికి మత్తుమందు లేదా డ్రగ్స్ ఇచ్చింది. సందీప్ స్పృహ కోల్పోయాక, అతని మెడలో ఉన్న బంగారు గొలుసు మరియు డబ్బులను దొంగిలించి అక్షత అక్కడి నుండి పారిపోయింది. అయితే, ఆ మత్తుమందు ప్రభావంతో సందీప్ గదిలోనే మృతి చెందాడు. సందీప్ మరణం తర్వాత అక్షత బెంగళూరుకు పారిపోయిందని తెలుసుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 3 రోజులు రాత్రింబవళ్లు గాలించి ఆమెను పట్టుకున్నారు. గోవాకు తీసుకువచ్చిన అక్షతను మాప్సా కోర్టులో హాజరుపరిచిన తర్వాత, ఆమె సందీప్‌కు ఇచ్చిన డ్రగ్స్ ఏమిటి? దీని వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారించనున్నారు.
