ఆధ్యాత్మిక భూమిగా పిలువబడే బృందావనంలో జరిగిన ఒక ఘటన భక్తులను, సాధారణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
బృందావనంలోని పరిక్రమ మార్గ్‌లో ఉన్న ‘శ్రీ రాధా కేళీకుంజ్’ సమీపంలోని ఓ బహుళ అంతస్తుల భవనం పైనుంచి పడి, ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ యువ శిష్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు దీపక్, 2025 నుంచి బృందావనంలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతున్నాడు. గురు ప్రేమానంద్ వద్ద దీక్ష తీసుకున్న తర్వాత, తన పేరును ‘రసిక్ దులారీ శరణ్’గా మార్చుకున్నాడు. అతను నివసిస్తున్న ‘గురు కృపా ధామ్’ భవనంలో అతనితో పాటు సుమారు 50 మంది ఆధ్యాత్మిక సాధకులు కూడా ఉంటున్నారు.
కాగా, శుక్రవారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఆ భవనం నాలుగో అంతస్తు నుంచి అతను కింద పడ్డాడు. అది చూసిన అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చని భావించినప్పటికీ, దగ్గరకు వెళ్లి చూడగా ఓ భయంకరమైన నిజం బయటపడింది. కిందపడిన ఆ యువకుడి రహస్య అవయవం తెగిపోయి ఉంది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. భవనం పైనుంచి దూకడానికి ముందే, అతను గ్రైండర్ (కట్టర్) వంటి యంత్రాన్ని ఉపయోగించి తన రహస్య అవయవాన్ని తానే కోసుకున్నాడని, ఆ తర్వాతే భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడని తేలింది. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది; సాయంత్రం అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనలో మరో అనుమానాస్పద విషయం ఏమిటంటే.. ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన జరిగినప్పటికీ, గాయపడిన యువకుడు సుమారు అరగంట పాటు అక్కడే పడి ఉన్నాడు. ఆ తర్వాతే కేళీకుంజ్ నిర్వాహకులు తమ సొంత కారులో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మధ్య సమయంలో పోలీసులకు గానీ, అధికారులకు గానీ వెంటనే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల దాటాకే ఆసుపత్రి నుంచి పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బృందావన్ సర్కిల్ ఆఫీసర్ (CO) సందీப் సింగ్ మాట్లాడుతూ.. “ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్య కేసులాగే కనిపిస్తోంది, అయినప్పటికీ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం, పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోంది” అని తెలిపారు.

Leave a Reply