మధుబని: బీహార్లోని మధుబని జిల్లాలో వినేవారికే ఒళ్లు గగుర్పొడిచే ఒక భయంకరమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడికి ప్రేమించినందుకు లభించిన శిక్ష.. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. యువతి కుటుంబ సభ్యులు సదరు ప్రేమికుడిని ప్లాన్ ప్రకారం ఒక సాకుతో ఇంటికి పిలిపించి, ఆపై పశువులకన్నా హీనంగా కొట్టి చంపేశారు. అంతటితో ఆగకుండా, అతడి మృతదేహంపై కూడా తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు.
లభించిన సమాచారం ప్రకారం.. నిందితులు యువకుడిని హతమార్చిన తర్వాత, అతడి ప్రైవేట్ పార్ట్స్ (అండకోశం) పై తీవ్రంగా దాడి చేసి ఛిద్రం చేశారు. ఈ భయానక దృశ్యాలను చూసి స్థానికులు సైతం వణికిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడిని పులేంద్ర పాశ్వాన్గా గుర్తించారు. తన కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసింది:
మృతుడు పులేంద్ర పాశ్వాన్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఈ దారుణ హత్యకు యువతి కుటుంబ సభ్యులే కారణం. పులేంద్రకు అదే గ్రామానికి చెందిన ఒక యువతితో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే, యువతి ఇంట్లో వారు మాత్రం ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే పులేంద్రకు గతంలో పలుమార్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మృతదేహంపై క్రూరత్వపు గుర్తులు – గొంతు నులిమి హత్య:
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు యువకుడి శరీరంపై తీవ్రమైన గాయాలు, రాక్షసంగా హింసించిన గుర్తులు కనిపించాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులు మొదట పులేంద్ర గొంతును గట్టిగా నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసారని, ఆ తర్వాతే మృతదేహంపై ఇష్టమొచ్చినట్లు దాడి చేసి వికృతంగా మార్చేశారని ప్రాథమిక విచారణలో తేలింది.
తోటలోని చెట్టుకు వేలాడుతూ శవం:
దర్భంగా జిల్లా జాలే పోలీస్ స్టేషన్ పరిధిలోని గఢీ గ్రామానికి చెందిన పులేంద్ర పాశ్వాన్ (24) మృతదేహం బుధవారం (జూన్ 24, 2026) ఉదయం మధుబనిలోని బెనిపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. భంగీ డీహ్ గ్రామంలోని ఒక పండ్ల తోటలో ఉన్న చెట్టుకు పులేంద్ర శవం వేలాడుతూ కనిపించింది.
గ్రామస్థులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి జానకి దేవి మాట్లాడుతూ.. పులేంద్ర మంగళవారం (జూన్ 23, 2026) రాత్రి 10 గంటల ప్రాంతంలో తన సోదరితో ఫోన్ లో మాట్లాడాడని, ఆ తర్వాత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడని తెలిపారు. రాత్రి వేళ ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో వెతికామని, తెల్లారేసరికి చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
