ఘోరం: కన్నకూతురిని చంపి తల్లి ఆత్మహత్య.. ఆర్థిక కష్టాలే కారణమా?

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే కాలయముడిలా మారింది. 14 ఏళ్ల కూతురిని ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసిన తల్లి, అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైట్‌ఫీల్డ్ సమీపంలోని ఇమ్మడిహళ్లిలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖర్, సువర్ణ దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు తుమకూరు హాస్టల్‌లో చదువుకుంటుండగా, కుమార్తె కారుణ్య (14) తల్లిదండ్రులతో కలిసి ఇమ్మడిహళ్లిలో నివసిస్తోంది. సోమవారం ఉదయం చంద్రశేఖర్ ఎప్పటిలాగే పనికి వెళ్లారు. మధ్యాహ్నం భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, తన సోదరుడిని ఇంటికి వెళ్లి చూడాలని కోరారు. ఆయన వెళ్లి చూసేసరికి తల్లి, కుమార్తె ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు.

గుండె కోత మిగిల్చిన ఆర్థిక ఇబ్బందులు: ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఆత్మహత్య వెనుక పెను ఆర్థిక సంక్షోభం ఉన్నట్లు తెలుస్తోంది. సువర్ణ భర్త చంద్రశేఖర్‌కు ఇటీవల ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ (గుండె మార్పిడి శస్త్రచికిత్స) జరిగింది. దీని కోసం భారీగా ఖర్చవ్వడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. అప్పుల బాధ, భవిష్యత్తుపై ఆందోళనతో సువర్ణ తీవ్రమైన మానసిక వేదనకు, కుంగుబాటుకు (Depression) లోనైనట్లు సమాచారం.

బంధువుల ఆవేదన: ఈ ఘటనపై సువర్ణ సోదరి ఉష మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. “ఆర్థిక ఇబ్బందుల గురించి తను తరచూ చెబుతూ బాధపడేది. బస్సు ఛార్జీలు భరించలేక ఫ్రీ టికెట్ ఉన్న బస్సుల్లోనే మా ఇంటికి వచ్చేది. అంత బాధలో ఉన్నా.. పసిపిల్ల కారుణ్యను చంపడం మాత్రం తీరని అన్యాయం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

వైట్‌ఫీల్డ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags: