ఘోరం: రసగుల్లా తిన్నాడని బాలుడిని మండుతున్న తందూరీ పొయ్యిలో పడేసిన క్యాటరర్!

బస్తీ (ఉత్తరప్రదేశ్): మానవత్వం మంటగలిసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా మలౌలీ గోసాయి గ్రామంలో వెలుగుచూసింది. పెళ్లి విందులో రసగుల్లాలు తిన్నాడన్న చిన్న కారణంతో, ఒక 11 ఏళ్ల బాలుడిని క్యాటరింగ్ మేనేజర్ అత్యంత క్రూరంగా మండుతున్న తందూరీ పొయ్యిలో పడేశాడు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

అసలేం జరిగిందంటే?

గొండ జిల్లాకు చెందిన చమన్ (11) అనే బాలుడు, తల్లి చనిపోవడంతో బస్తీ జిల్లాలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ రెండో తరగతి చదువుతున్నాడు. బుధవారం తన అమ్మమ్మతో కలిసి మలౌలీ గోసాయి గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు వెళ్లాడు. అక్కడ తోటి పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడిపిన చమన్, కాసేపటికి భోజనాల దగ్గరకు వెళ్ళి రసగుల్లాలు తినడం మొదలుపెట్టాడు.

బాలుడు పదే పదే ప్లేటులో స్వీట్లు వేసుకోవడం చూసిన అక్కడి క్యాటరింగ్ మేనేజర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మొదట బాలుడిని హెచ్చరించిన మేనేజర్, ఆ తర్వాత తనలోని రాక్షసుడిని బయటకు తీశాడు. చిన్నారి అని కూడా చూడకుండా చమన్‌ను అమాంతం ఎత్తి, పక్కనే మండుతున్న వేడి వేడి తందూరీ పొయ్యిలో పడేశాడు.

హాహాకారాలు.. ఒళ్ళు కాలిపోయిన బాలుడు

బాలుడి కేకలు విన్న బంధువులు, అతిథులు వెంటనే తందూరీ పొయ్యి వద్దకు పరుగులు తీశారు. అప్పటికే ఆ చిన్నారి ముఖం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే బాధితుడిని అయోధ్య మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం లక్నోకు తరలించారు.

నిందితుడు పరారీ.. పోలీసుల వేట

ఈ దారుణానికి ఒడిగట్టిన క్యాటరింగ్ మేనేజర్, బాలుడిని పొయ్యిలో నుంచి బయటకు తీసేలోపే అక్కడి నుండి పరారయ్యాడు. బాలుడి మేనమామ దేవీదీన్ నిషాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చావనీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ స్వర్ణిమ సింగ్ స్పందిస్తూ.. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేవలం రసగుల్లా కోసం ఒక చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆ రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: