పాకిస్తాన్లో ఉన్నత విద్యను అభ్యసించిన నిపుణులు మెరుగైన ఉపాధి అవకాశాలు, భద్రతను వెతుక్కుంటూ విదేశాలకు తరలిపోవడం గణనీయంగా పెరుగుతోందని పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉన్నత విద్యావంతులు విదేశాలకు వెళ్లారు. కేవలం 2025లోనే ఏకంగా 28,726 మంది ఉన్నత అర్హతలు కలిగిన నిపుణులు దేశాన్ని వీడినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇలా విదేశాలకు వెళ్తున్న వారిలో వైద్యులు, ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, ఉపాధ్యాయులు ప్రధానంగా ఉన్నారు.
పాకిస్తాన్ నుంచి విదేశాలకు వెళ్లే వైద్యుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. 2024లో 3,625 మంది వైద్యులు విదేశాలకు వెళ్లగా, 2025లో ఈ సంఖ్య 3,795కి చేరింది. 2026లో ఇప్పటివరకు 2,093 మంది వైద్యులు ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఉపాధ్యాయుల విషయానికొస్తే.. 2024లో 1,729 మంది, 2025లో 1,725 మంది, ఇక 2026లో ఇప్పటివరకు 1,457 మంది ఉపాధ్యాయులు దేశాన్ని వీడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పాక్ ప్రభుత్వానికి చెందిన మరో నివేదిక ప్రకారం.. 2024 నుంచి 2026 మధ్య కాలంలో సుమారు 22 లక్షల మంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. వీరిలో అత్యధికులు సౌదీ అరేబియాకు వెళ్లడం గమనార్హం. దాదాపు 11 లక్షల మంది సౌదీ అరేబియాకు, 3 లక్షలకు పైగా నిరుద్యోగులు యూఏఈ (UAE)కి వెళ్లారు. అంతేకాకుండా దాదాపు 1.5 లక్షల మంది ఒమన్‌కు, 1.34 లక్షల మంది కువైట్‌కు వెళ్లినట్లు తేలింది. యూరోపియన్ దేశాల విషయానికొస్తే, పాకిస్తానీయులు ఉపాధి కోసం బ్రిటన్ను ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు.
పాకిస్తాన్లో ఏటా సుమారు 5 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది ఇంజినీరింగ్ పట్టాలు, 36,000 మంది మెడిసిన్, డెంటల్ డిగ్రీలు పొందుతున్నారు. ఇలా ఉన్నత విద్యను అభ్యసించి నైపుణ్యం సాధించిన వారు భారీ సంఖ్యలో విదేశాలకు వలస వెళ్తుండటం వల్ల, దేశంలోని కీలక రంగాలలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. పాకిస్తాన్లో ప్రతి 723 మంది జనాభాకు ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే వైద్య సిబ్బంది కొరత వేధిస్తున్న నేపథ్యంలో, ఇలా వైద్యులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వలస వెళ్లడం అక్కడి ఆరోగ్య రంగానికి పెను సవాలుగా మారింది. మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆదాయం, జీవన భద్రత కోసం ప్రజలు విదేశాల బాట పట్టే ఈ ధోరణిని అరికట్టాలంటే.. వారిని దేశంలోనే నిలుపుకునేందుకు తగిన ఉపాధి అవకాశాలను, అనుకూలమైన పని వాతావరణాన్ని మెరుగుపరచాల్సిన అత్యవసర పరిస్థితి పాకిస్తాన్‌కు ఏర్పడింది.

Leave a Reply