భారతదేశంలోని ప్రాథమిక పాఠశాలల తరగతి గదుల్లో పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అనే దానిపై నిర్వహించిన అధ్యయనంలో, వాళ్లు మాట్లాడటానికి, ప్రశ్నలు అడగడానికి తగినన్ని అవకాశాలు లభించడం లేదని తేలింది.
లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ ఫౌండేషన్ (LLF) నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ సర్వే (TLPS) 2025 నివేదిక ఈ విషయాన్ని ఎత్తిచూపుతోంది.
9 రాష్ట్రాల్లోని 1,050 తరగతి గదుల్లో ఈ సర్వే జరిగింది. ఒకటవ, రెండవ తరగతి విద్యార్థుల బోధనా, అభ్యసన పద్ధతులపై ఈ అధ్యయనం చేపట్టారు. ముఖ్యంగా భాష, గణితం సబ్జెక్టులకు సంబంధించిన తరగతి గది కార్యకలాపాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ సర్వే ప్రకారం, దాదాపు మూడింట రెండొంతుల తరగతి గదుల్లో పిల్లలు ఎక్కువగా నిశ్శబ్దంగా ఉంటూ, ఉపాధ్యాయులు లేదా ఇతరులు చెప్పేది వినడానికే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు. తరగతి చర్చల్లో పాల్గొనడం, ప్రశ్నలు అడగడం, ఉపాధ్యాయులతో మాట్లాడటం లేదా తోటి విద్యార్థుల నుండి నేర్చుకోవడం వంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక చెబుతోంది.
అంతేకాకుండా, తరగతి గది కోసం కేటాయించిన సమయంలో 27 శాతం ఎలాంటి అభ్యసన కార్యకలాపాలు (Learning activities) లేకుండానే వృధాగా గడిచిపోతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో, 32 శాతం సమయం ఉపాధ్యాయుడు లేదా మరో విద్యార్థి చదువుతుంటే వినడం, చూడటం లేదా బ్లాక్ బోర్డ్ మీద ఉన్నది రాసుకోవడం (కాపీ చేయడం) వంటి పనులకే సరిపోతోంది. ప్రాథమిక తరగతుల్లో పిల్లలు ఎక్కువగా మాట్లాడేలా, వివిధ యాక్టివిటీలలో పాల్గొనేలా, ఒకరికొకరు నేర్చుకునేలా అవకాశం కల్పిస్తూ… బోధనను మరింత ఇంటరాక్టివ్గా (Interactive) మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Leave a Reply