రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జీవించడానికి వెయ్యి మార్గాలు ఉన్నప్పటికీ, ఈ జంట ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది? దుంగార్పూర్ జిల్లాలోని మాండవ్ గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలోకి గ్రామస్థులు కొందరు కట్టెల కోసం వెళ్లారు. ఆ సమయంలో వారికి విపరీతమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా, ఒకే చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. ఆ మృతదేహాలు సుమారు 15 రోజులుగా అక్కడే ఉండటంతో పూర్తిగా ఎండిపోయి, గుర్తుపట్టలేనంతగా సిథిలమయ్యాయి.
పోలీసుల దర్యాప్తు: సమాచారం అందుకున్న వార్దా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు అదే ప్రాంతానికి చెందిన ప్రేమికులని తేలింది. వీరిద్దరూ జనవరి 1వ తేదీ నుంచి తమ ఇళ్ల నుండి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు వీరి కోసం వెతుకుతున్న క్రమంలో ఈ దారుణ వార్త తెలిసింది.
ఒకే గోత్రం – పెళ్లికి నిరాకరణ: పోలీసు అధికారి రిజ్వాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరి ప్రేమకు రెండు కుటుంబాల వారు అంగీకరించలేదు. ఇద్దరిదీ ‘ఒకే గోత్రం’ కావడంతో, సంప్రదాయాల ప్రకారం వారి వివాహం జరపడం కుదరదని పెద్దలు తెగేసి చెప్పారు. దీనివల్ల వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను తట్టుకోలేక, ఇంటి నుండి పారిపోయి అడవిలోకి వెళ్లి ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్యేనా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
