గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో, కడుపునొప్పికి చికిత్స కోసం వెళ్లిన 25 ఏళ్ల యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
ఈ సంఘటనకు సంబంధించి పరారీలో ఉన్న సదరు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధిత యువతి అల్సర్ సమస్యతో మేమన్‌నగర్ ప్రాంతంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్ వ్రజ్ సతీష్‌కుమార్ పటేల్ వద్ద ఆమె చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 1వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆ యువతిని పరీక్షించే సమయంలో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆసుపత్రి గదిలో మహిళా వైద్యురాళ్లు లేదా ఇతర సిబ్బంది ఎవరూ లేని సమయంలో ఆమెను లోపలికి ఒంటరిగా తీసుకెళ్లిన ఆ డాక్టర్, చేతులకు గ్లౌజులు కూడా ధరించకుండా ఆమె శరీర భాగాలను తప్పుగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ యువతి వెంటనే జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది.
అనంతరం బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఆ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. వైద్యం పేరిట నమ్మించి డాక్టరే ఇలాంటి అకృత్యానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.

Leave a Reply