“చివరిగా కొడుకుతో రాత్రే మాట్లాడారు…!” మరుసటి రోజు ఉదయానికే అదృశ్యం! సొంత ఇంట్లోనే ప్లాస్టిక్ కవర్లలో చుట్టి పెట్టెలో కుక్కిన వృద్ధ దంపతుల మృతదేహాలు… కలకలం!

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వెలుగుచూసిన అత్యంత పాశవిక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, భయాందోళనలను రేకెత్తించింది.

గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధ దంపతుల మృతదేహాలు, వారి సొంత ఇంట్లోని ఒక పెద్ద పెట్టెలో ప్లాస్టిక్ కవర్లలో చుట్టబడి కుళ్ళిన స్థితిలో లభ్యమవడం సంచలనం సృష్టించింది.

ఉదయ్‌పూర్ జిల్లా పునావళి గ్రామానికి చెందిన లహరీలాల్ మరియు ఆయన భార్య గ్రామంలోని ఇంట్లో నివసిస్తున్నారు. వీరి కుమారుడు ఉపాధి నిమిత్తం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉంటుండటంతో, ఈ వృద్ధ దంపతులు గ్రామంలో ఒంటరిగానే జీవిస్తున్నారు.

ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వీరు కనిపించకుండా పోయారు. కొడుకు తల్లిదండ్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, అనుమానం వచ్చి బంధువులను ఇంటికి వెళ్లి చూడమని చెప్పాడు. అయితే ఇంట్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఈ నేపథ్యంలో అదృశ్యమైన వృద్ధ దంపతులను వెంటనే కనిపెట్టాలంటూ బంధువులు, గ్రామస్తులు కలిసి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు.

పరిస్థితి ఇలా ఉండగా, శుక్రవారం ఉదయం ఆ మూసి ఉన్న ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం మొదలైంది. వెంటనే స్థానికులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా, ఒక పెద్ద పెట్టె నుంచి కంపు వాసన వస్తున్నట్లు గుర్తించారు. అనుమానంతో ఆ పెట్టెను తెరిచి చూసిన స్థానికులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అందులో వృద్ధ దంపతుల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి, వాటిపై దుప్పట్లు వేసి దాచి ఉంచారు. సమాచారం అందుకున్న వెంటనే సైరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుల కుమారుడు మాట్లాడుతూ… “మంగళవారం రాత్రే మా అమ్మతో ఫోన్‌లో మాట్లాడాను, అంతలోనే బుధవారం ఉదయానికల్లా అమ్మానాన్న కనిపించట్లేదన్న వార్త తెలిసింది” అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దుండగులు పక్కా ప్లాన్‌తోనే వీరిని హత్య చేసి, శవాలు బయటపడకుండా పెట్టెలో కుక్కి ఉంటారని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధులను టార్గెట్ చేసి నగలు, డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: