బ్రెజిల్‌లోని విశాలమైన సెర్రాడో (Cerrado) ప్రాంతంలో ప్రొఫెసర్ లూయిస్ కార్లోస్ ఫోర్టి మరియు ఆయన బృందం ఒక శాస్త్రీయ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
వదిలివేయబడిన ఒక భారీ ‘లీఫ్-కట్టర్’ (ఆకులను కత్తిరించే) చీమల పుట్టలోకి వారు ఏకంగా పది టన్నుల సిమెంటును పోశారు. ఆ కాంక్రీటు 26 అడుగుల లోతు వరకు విస్తరించి ఉన్న సంక్లిష్టమైన సొరంగ మార్గాల నెట్‌వర్క్‌ను నింపడానికి 10 రోజుల సమయం పట్టింది.
సుదీర్ఘ పరిశోధన తర్వాత, ఆ చీమలు ఒక భారీ భూగర్భ నిర్మాణాన్ని సృష్టించినట్లు వెల్లడైంది. లక్షలాది చీమలు నివసించిన ఈ విస్తృత నిర్మాణంలో ఆహార సేకరణ సొరంగాలు, శిలీంధ్రాల (Fungus) తోటలు మరియు గాలి వెలుతురు కోసం ప్రత్యేక వసతులు వంటి అత్యంత సూక్ష్మమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, మానవుల సివిల్ ఇంజనీరింగ్ అద్భుతాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, ఒక సంక్లిష్టమైన పట్టణ వాతావరణాన్ని నిర్మించడానికి ఈ కీటకాలు సుమారు 40 టన్నుల మట్టిని తరలించినట్లు కనుగొన్నారు.
హైవే వంటి నిర్మాణం
పరిశోధన ఫలితాల ప్రకారం, 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 26 అడుగుల లోతులో విస్తరించిన ఒక భారీ చీమల పుట్టను పరిశోధకులు గుర్తించారు. దాని ఆకృతిని తెలుసుకోవడానికి వారు సిమెంటు పోసి పరిశీలించినప్పుడు, ప్రతి గదికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉన్నట్లు తెలిసింది. తమ ప్రధాన ఆహారమైన శిలీంధ్రాలను పెంచడానికి దీర్ఘవృత్తాకార గదులను, వ్యర్థాలను సేకరించడానికి ప్రత్యేక గదులను ఆ చీమలు నిర్మించుకున్నాయి. వాటి సొరంగ మార్గాలు ఏదో మొక్కుబడిగా తవ్వినవి కావు.. ఆకులను వేగంగా తీసుకెళ్లడానికి, ఆక్సిజన్ ధారాళంగా అందడానికి ఒక హైవే (నేషనల్ హైవే) లాగా నిర్మించబడ్డాయి.
సమిష్టి కృషి
చైనా గోడను నిర్మించడానికి మానవులు చూపిన సమిష్టి కృషినే ఈ చీమలు కూడా ప్రదర్శించాయి. ఇవి దాదాపు 40 టన్నుల మట్టిని భూమి పైకి తీసుకువచ్చాయి. మట్టి స్వభావాన్ని అర్థం చేసుకుని, పైనుంచి వచ్చే ఒత్తిడికి సొరంగాలు కూలిపోకుండా అత్యంత ఖచ్చితత్వంతో వీటిని నిర్మించాయి. దీనివల్ల రాణి చీమ మరియు దాని గుడ్లు భూమి అడుగున చాలా సురక్షితంగా ఉంటాయి.
అంతేకాకుండా, ఈ పుట్టలు సహజమైన గాలి వెలుతురు (Ventilation) వచ్చేలా రూపొందించబడ్డాయి. శిలీంధ్రాల గదుల్లో ఉత్పన్నమయ్యే వేడి ‘చిమ్నీ ఎఫెక్ట్’ (Chimney effect) ను సృష్టించి, పైనుంచి తాజా గాలిని లోపలికి లాక్కునేలా సొరంగాలు అమర్చబడి ఉన్నాయి. క్రిములు వ్యాపించకుండా వ్యర్థాల గదులను అంచులలో మరియు అడుగు భాగంలో నిర్మించారు. పుట్టలోని ప్రతి చిన్న మార్గాన్ని మ్యాపింగ్ చేయడానికి శాస్త్రవేత్తలు సుమారు 10,000 కిలోల సిమెంట్ మిశ్రమాన్ని ఉపయోగించి ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చాటారు.
