బీహార్: బీహార్‌లో బలవంతపు పెళ్లిళ్లు ఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఖగడియా జిల్లాలో జరిగిన ఒక వివాహం సినీ ఫక్కీలో ఉంటూ అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఒక యువకుడు తనను ప్రాణ భయంతోనే బలవంతంగా పెళ్లి చేసుకున్నానని ఆరోపిస్తుంటే, వధువు మాత్రం ఇది ప్రేమ వివాహమేనని వాదిస్తోంది.
ఏం జరిగింది?
- పరిచయం: 22 ఏళ్ల నితీశ్ కుమార్ అనే బి.ఎ. విద్యార్థి, తన సోదరి అత్తవారింటికి వెళ్లినప్పుడు 34 ఏళ్ల సీతాదేవిని కలిశాడు. ఆ సమయంలో సీత తన చెల్లెలు ఈషాతో పెళ్లి చేయిస్తానని చెప్పి, నితీశ్ ఫోన్ నంబర్ తీసుకుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి.
- ట్విస్ట్: గురువారం కళాశాల పనిమీద వెళ్లిన నితీశ్‌ను సీత కలవాలని కోరింది. ఆ తర్వాత అతడిని ఇంటికి తీసుకెళ్లింది. చీకటి పడటంతో నితీశ్‌ను అక్కడే ఉండమని ఆమె కుటుంబ సభ్యులు కోరారు.
- బలవంతపు పెళ్లి?: ఆ రాత్రి పదిమంది యువకులు వచ్చి తనను తుపాకీతో బెదిరించి, ప్రాణాలతో కావాలంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి గుడికి తీసుకెళ్లారని, అక్కడ బలవంతంగా సింధూరం పెట్టించారని నితీశ్ ఆరోపిస్తున్నాడు. మరుసటి రోజు కోర్టులో రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తే, తాను సంతకం నిరాకరించానని తెలిపాడు.
- వధువు వెర్షన్: ఈ ఆరోపణలను సీతాదేవి పూర్తిగా ఖండించింది. నితీశ్‌తో తనకు రెండు నెలలుగా ప్రేమ సంబంధం ఉందని, అతడే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని ఆమె పేర్కొంది. తాను విడాకులు తీసుకున్న మహిళనని తెలిసినా, తనను, తన బిడ్డను స్వీకరిస్తానని అతను హామీ ఇచ్చాడని ఆమె చెప్పింది. ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6 లక్షల కోసం అతను వివాదం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.
పోలీసుల వద్దకు చేరిన వ్యవహారం: శుక్రవారం బార్ సివిల్ కోర్టులో నితీశ్ గొడవ చేయడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. ప్రస్తుతం ఇరు పక్షాలు పరస్పరం కేసులు పెట్టుకుంటున్నాయి. వీడియోలో పెళ్లి సంతోషంగానే కనిపిస్తుండగా, నితీశ్ మాత్రం బలవంతపు పెళ్లి అని వాదించడం ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది.
