దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ‘బ్రిక్స్’ (BRICS) సదస్సు కోసం కట్టుదిట్టమైన బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, ప్రముఖుల బస కోసం కేటాయించిన ఒక కీలక స్టార్ హోటల్ టెర్రస్‌పై స్నైపర్ గన్‌తో భద్రతా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్, సోషల్ మీడియా రీల్స్ చేస్తూ హల్చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది.
ఢిల్లీ పోలీస్ వాయవ్య (నార్త్‌వెస్ట్) జిల్లా విభాగానికి చెందిన దీపక్ బంగర్ అనే కానిస్టేబుల్, అంతర్జాతీయ ప్రతినిధులు బస చేసిన ప్రాంతంలో అత్యున్నత స్థాయి భద్రతా విధుల్లో ఉన్నారు.
కానీ, తనకు అప్పగించిన విధి నిర్వహణలోని తీవ్రతను ఏమాత్రం పట్టించుకోకుండా, నడుముకు సర్వీస్ పిస్టల్ తగిలించుకుని, చేతిలో స్నైపర్ రైఫిల్ పట్టుకుని గురిచూస్తున్నట్లు భంగిమలు ఇస్తూ విభిన్న కోణాల్లో వీడియోలు తీసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
అతి సున్నితమైన భద్రతా ప్రాంతం, చుట్టుపక్కల కీలక భవనాల నిర్మాణాలు, అధునాతన ఆయుధాలు స్పష్టంగా కనిపించేలా తీసిన ఆ రీల్స్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో కీలకమైన భద్రతా రహస్యాలు బహిర్గతమయ్యాయంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై స్పందించిన ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు.. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను కానిస్టేబుల్ దీపక్ బంగర్‌ను భద్రతా విధుల నుంచి తప్పించడమే కాకుండా, వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాంటి హై-సెక్యూరిటీ జోన్ నుండి ఇలాంటి వీడియోలు ఎలా చిత్రీకరించారు, సోషల్ మీడియాలో ఎలా అప్లోడ్ చేశారు అనే కోణంలో శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు. అంతర్జాతీయ నేతలు హాజరైన సదస్సులో భద్రత కల్పించాల్సిన కానిస్టేబులే రీల్స్ పిచ్చితో సస్పెండ్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply