చేతిలో స్మార్ట్‌ఫోన్.. నోట్లో చిప్స్.! ఈ అలవాటును తేలిగ్గా తీసిపారేయకండి! తెలియకుండానే అతిగా తినేలా చేసే ఈ కాంబినేషన్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.?

నేటి రోజుల్లో పిల్లలు గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌లు చూడటంతో పాటు చిప్స్, చాక్లెట్లు వంటి ప్యాక్డ్ ఫుడ్స్ తినే అలవాటు విపరీతంగా పెరిగిపోతోంది.

పిల్లలు అల్లరి చేయకుండా ఒకేచోట కూర్చోవాలని తల్లిదండ్రులు, తాతయ్య-నానమ్మలు ఫోన్‌తో పాటు ఇలాంటి జంక్ ఫుడ్‌ను చేతికి ఇవ్వడం పరిపాటిగా మారింది.

పిల్లలు స్క్రీన్ వైపు చూస్తూ తినడం వల్ల ఎంత తింటున్నామనే దానిపై ధ్యాస ఉండదని ప్రముఖ శిశువైద్య నిపుణులు (పీడియాట్రీషియన్) డాక్టర్ రోలీ మున్షీ హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కడుపు నిండిందా లేదా ఆకలి ఇంకా ఉందా అనే స్పృహ లేక అవసరానికి మించి అతిగా తినే ప్రమాదం ఏర్పడుతుంది.

ప్యాక్డ్ ఫుడ్స్‌లో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. భవిష్యత్తులో చిన్న వయసులోనే మధుమేహం (షుగర్ వ్యాధి) వంటి తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మరోవైపు, ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూ కూర్చోవడం వల్ల పిల్లల్లో శారీరక శ్రమ క్రమంగా తగ్గిపోతుంది.

అంతేకాకుండా, రాత్రి వేళల్లో ఆలస్యంగా ఫోన్ చూడటం వారి నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి పిల్లలు తినే సమయంలో ఫోన్‌లను పూర్తిగా దూరం పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో వండిన పోషక విలువలతో కూడిన ఆహారం, తాజా పండ్లు, కూరగాయలను అలవాటు చేయడంతో పాటు, రోజూ ఆరుబయట ఆటలు, శారీరక వ్యాయామానికి తప్పనిసరిగా సమయం కేటాయించాలని స్పష్టం చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *