టెహ్రాన్: అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన వైమానిక దాడుల వల్ల ఇరాన్ భారీ విధ్వంసాన్ని చవిచూసింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అయితే, ఇరాన్ ఎదుర్కొన్న ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణం చైనాను నమ్మడమేనని, చైనా తయారు చేసిన వైమానిక రక్షణ వ్యవస్థ (Air Defense System) కీలక సమయంలో మొరాయించిందని విస్తుపోయే సమాచారం బయటకు వచ్చింది.
అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. అమెరికా తన ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ విమాన వాహక నౌక నుండి యుద్ధ విమానాలు మరియు క్షిపణుల ద్వారా ఇరాన్‌పై దాడులు చేస్తోంది. దీనికి ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తూ కతర్, యూఏఈ, సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది.
ఈ యుద్ధంలో ఇరాన్ దారుణంగా దెబ్బతినడానికి కారణం చైనా నుండి కొనుగోలు చేసిన HQ-9B అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ క్షిపణి సాంకేతికతలో బలంగా ఉన్నప్పటికీ, శత్రువుల విమానాలు లేదా క్షిపణులను గాలిలోనే గుర్తించి ధ్వంసం చేసే టెక్నాలజీలో వెనుకబడి ఉంది. గతంలో ఇరాన్ రష్యా తయారు చేసిన S-300 వ్యవస్థను నమ్మింది. కానీ, గతేడాది ఇజ్రాయెల్ జరిపిన అణు కేంద్రాల దాడుల్లో రష్యా సిస్టమ్ విఫలమైంది.
దీంతో ఇరాన్ చైనా వైపు మళ్లింది. చైనా నుండి HQ-9B రక్షణ వ్యవస్థను ‘ఆయిల్ ఫర్ వెపన్స్’ (చమురుకు బదులు ఆయుధాలు) ఒప్పందం కింద కొనుగోలు చేసింది. ఈ HQ-9B వ్యవస్థ 260 కిలోమీటర్ల దూరంలో వచ్చే డ్రోన్లు, క్షిపణులను గుర్తించి, 50 కిలోమీటర్ల ఎత్తులోనే వాటిని పేల్చివేస్తుందని చైనా ప్రచారం చేసింది. టెహ్రాన్, ఇస్ఫహాన్ వంటి కీలక నగరాల రక్షణ కోసం ఇరాన్ దీనిని మోహరించింది.
కానీ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఈ చైనా సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదు. శత్రు విమానాలను గుర్తించడంలో ఇది పూర్తిగా విఫలమైంది. చైనా ఆయుధాలు విఫలం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో భారత్ పాకిస్థాన్‌పై జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూడా పాక్ ఉపయోగించిన ఇదే HQ-9B సిస్టమ్ భారత్ క్షిపణులను అడ్డుకోలేకపోయింది. చైనా ఆయుధాలపై అతిగా ఆధారపడటం వల్లే ఇరాన్ నేడు ఈ దుస్థితికి చేరుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
