చైనా, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం ఆర్టిలరీ (ఫిరంగి) దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, మరో 335 K9 వజ్ర ఆటోమేటిక్ (సెల్ఫ్ ప్రొపెల్డ్) ఫిరంగుల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ కొనుగోళ్ల మండలి (DAC) ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.20,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కొత్త ఫిరంగులు సైన్యంలో చేరితే, శరవేగంగా కదులుతూ దాడులు చేసే సామర్థ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత సైన్యం వద్ద సుమారు 200 K9 వజ్ర ఫిరంగులు ఉన్నాయి. అదనంగా 335 ఫిరంగుల కొనుగోలు ప్రణాళిక అమలైతే, సైన్యంలో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దక్షిణ కొరియాకు చెందిన K9 థండర్ ఫిరంగి ఆధారంగా రూపొందించబడిన K9 వజ్ర.. 155 మిల్లీమీటర్లు, 52 కాలిబర్ స్వయంచాలక ఫిరంగి విభాగానికి చెందింది. అత్యంత వేగంగా కదలగలగడం, శరవేగంగా స్థావరాలను మార్చుకోగలగడం దీని ప్రధాన లక్షణాలు.
ఈ కొత్త ఫిరంగుల తయారీలో 70 శాతానికి పైగా స్వదేశీ విడిభాగాలను ఉపయోగించాలని యోచిస్తున్నారు. భారతదేశానికి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ, దక్షిణ కొరియా సంస్థల సహకారంతో ఈ ఫిరంగులను తయారు చేస్తోంది. దీని ద్వారా దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి, విడిభాగాలను సరఫరా చేసే భారతీయ కంపెనీలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
ముఖ్యంగా, తూర్పు లడఖ్ లాంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో, తీవ్రమైన చలిలోనూ ఈ ఫిరంగులు సమర్థవంతంగా పనిచేసేలా ప్రత్యేక మార్పులు చేయనున్నారు. ఇందుకోసం అతి తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా కీలక వ్యవస్థలు పనిచేసేందుకు వీలుగా వింటర్ ఆపరేటింగ్ కిట్లను (శీతాకాల వినియోగ పరికరాలు) అమర్చనున్నారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే, కఠినమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతాల్లో భారత సైన్యం ఆపరేషనల్ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. అయితే, ఈ కొత్త ఫిరంగుల కొనుగోలు, పంపిణీకి సంబంధించిన తదుపరి దశలు పూర్తయిన తర్వాతే అవి అధికారికంగా సైన్యంలోకి చేరతాయి.

Leave a Reply