ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్ ఎక్స్పోలో ఒక రోబోటిక్ డాగ్ పెను సంచలనంగా మారింది. గల్గోటియాస్ యూనివర్శిటీ చైనాలో తయారైన రోబోను ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆవిష్కరణగా ప్రదర్శించిందనే ఆరోపణలు రావడంతో, వివాదం సోషల్ మీడియా నుండి యూనివర్శిటీ గుర్తింపు ప్రశ్నార్థకం అయ్యే వరకు వెళ్ళింది. చివరకు నిర్వాహకులు ఆ యూనివర్శిటీని ఎక్స్పో నుండి తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు.
వివాదం ఎలా మొదలైంది?
- గల్గోటియాస్ యూనివర్శిటీ ‘ఓరియన్’ (Orion) పేరుతో ఒక రోబోటిక్ కుక్కను ప్రదర్శించింది. దీనిని యూనివర్శిటీకి చెందిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ విద్యార్థులే స్వయంగా తయారు చేశారని, ఇది గొప్ప భారతీయ ఆవిష్కరణ అని ప్రచారం చేశారు.
- అయితే, ఈ రోబోకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో టెక్ నిపుణులు ఇది చైనా కంపెనీ Unitree Robotics కు చెందిన Unitree Go2 మోడల్ అని గుర్తించారు. మార్కెట్లో దీని ధర సుమారు ₹2 నుండి ₹3 లక్షల వరకు ఉంటుంది.
యూనివర్శిటీ సంజాయిషీ: వివాదం ముదరడంతో యూనివర్శిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ స్పందిస్తూ.. “మేము విషయాలను స్పష్టంగా వివరించడంలో విఫలమయ్యాము. ఆ రోబోను మేము తయారు చేయలేదు, అది కేవలం విద్యార్థులకు నేర్పించడానికి వాడే లెర్నింగ్ టూల్ మాత్రమే” అని పేర్కొన్నారు. గల్గోటియాస్ యూనివర్శిటీ అధికారికంగా ట్వీట్ చేస్తూ.. “మేము చైనా రోబోను తయారు చేయలేదు, భవిష్యత్తులో అలాంటి సాంకేతికతను భారత్ లోనే తయారు చేసేలా మా విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతున్నాము” అని వివరణ ఇచ్చింది.
