ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మంచు రాక్షసుడు ఇప్పుడు మెల్లమెల్లగా కరిగిపోతున్నాడు. దశాబ్దాలుగా ఒకే చోట కదలకుండా ఉన్న ఈ భారీ మంచుకొండను కొందరు ప్రకృతి వింతగా భావిస్తే, మరికొందరు రాబోయే విపత్తుకు సంకేతంగా హెచ్చరించారు.
చైనా శాటిలైట్ చూసిన భయంకర దృశ్యం:
A23a అనేది సాధారణ మంచు ముక్క కాదు. ఇది 4,170 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఒక భారీ మంచు ఖండం. సుమారు మూడు దశాబ్దాల పాటు సముద్రంలో స్థిరంగా ఉన్న ఈ మంచుకొండ విచ్ఛిన్నం కావడాన్ని చైనాకు చెందిన FY-3D శాటిలైట్ గుర్తించింది. చైనా వాతావరణ శాఖ (CMA) వెల్లడించిన వివరాల ప్రకారం:
- జనవరి 8, 2026 వరకు నిలకడగా ఉన్న ఈ మంచుకొండ, అకస్మాత్తుగా నాలుగు భారీ ముక్కలుగా విడిపోయింది.
- కేవలం కొన్ని రోజుల్లోనే దీని వైశాల్యం 948 చ.కి.మీ నుండి 503 చ.కి.మీ కు పడిపోయింది.
లోపల నుండి పేలుతున్న మంచుకొండ (Hydrofracturing):
శాటిలైట్ చిత్రాలలో మంచుకొండపై మెరుస్తున్న నీలిరంగు మచ్చలు కనిపిస్తున్నాయి. ఇవి అందమైన సరస్సులు కావు, ‘హైడ్రోఫ్రాక్చరింగ్’ అనే ప్రమాదకర ప్రక్రియకు నిదర్శనం. సూర్యుని వేడికి మంచు కరిగి నీరుగా మారుతోంది. ఆ నీరు మంచుకొండలోని లోతైన పగుళ్లలోకి చేరి, గొడ్డలిలా పనిచేస్తూ ఆ పగుళ్లను మరింత వెడల్పు చేస్తోంది. దీనివల్ల ఆ మంచు రాక్షసుడు లోపల నుండి ముక్కలైపోతున్నాడు.
రాబోయే ప్రమాదం ఏంటి?
ఈ ప్రధాన మంచుకొండ పూర్తిగా విచ్ఛిన్నమైతే, వేల సంఖ్యలో చిన్న చిన్న మంచు ముక్కలు సముద్రంలో తేలుతూ ప్రయాణిస్తాయి. ఇవి సముద్ర ప్రయాణం చేసే ఓడలకు ‘సైలెంట్ కిల్లర్స్’ లా మారుతాయని చైనా బ్రాడ్కాస్టర్ హెచ్చరించింది.
1986లో అంటార్కిటికా తీరం నుండి విడిపోయిన ఈ మంచుకొండ ఎంత పెద్దదంటే, ఇందులో లండన్ నగరాన్ని రెండుసార్లు ఇమడ్చవచ్చు. కానీ ప్రకృతి ప్రకోపానికి ఇప్పుడు ఇది తన అసలు పరిమాణంలో ఎనిమిదో వంతు కూడా మిగలలేదు.
