బెంగళూరులో తన ఇంటి ముందే గుర్తుతెలియని వ్యక్తి గొలుసు లాక్కెళ్లిన భయాందోళనలో ఒక అమాయక మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఏం జరిగింది? బెంగళూరు నెలమంగళ సమీపంలోని హుస్కుర్ ప్రాంతానికి చెందిన జ్యోతి (45) అనే మహిళ, బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధమై ఇంటి బయటకు వచ్చారు. అప్పుడే బైక్పై వేచి ఉన్న ఒక దుండగుడు, జ్యోతిని చూడగానే బైక్ స్టార్ట్ చేసి ఒక యూ-టర్న్ (U-turn) తీసుకుని, ఆమె మెడలోని 9 సవరల (72 గ్రాములు) బంగారు గొలుసును లాక్కొని అత్యంత వేగంతో పారిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్కు గురైన జ్యోతి, కేకలు వేస్తూ దొంగను వెంబడించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఆమె ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయారు.
కేకలు విని బయటకు వచ్చిన పొరుగువారు, జ్యోతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అంబులెన్స్ ద్వారా ఆమెను నెలమంగళలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మడనాయకనహళ్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తు: పోలీసులు జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 100కు పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ దొంగ కోసం గాలిస్తున్నారు.
