మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలోని చోలా మందిర్ ప్రాంత పరిధిలోని కార్పొరేషన్ కాలనీలో రాకేష్ అహిర్వార్ నివసిస్తున్నాడు.
గత జూలై 31వ తేదీ రాత్రి సమయంలో ఇతను మద్యం మత్తులో వంట పూర్తి చేసి టీవీ చూస్తుండగా, ఊహించని విధంగా ఇతని చెయ్యి తగిలి రిమోట్ బటన్ మారి టీవీ ఛానెల్ మారింది.
ఈ చిన్న తప్పుతో కోపగించిన ఇతని భార్య రామ్మని అహిర్వార్, దీని వల్ల టీవీ పాడైపోతుందని చెబుతూ భర్తతో గొడవకు దిగింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణగా మారడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ ఇంట్లో ఉన్న చాకు లాంటి పదునైన ఆయుధంతో భర్త తల మరియు చెంపపై దారుణంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను రక్తమడుగులో కేకలు వేయగా, శబ్దం విని పరుగెత్తుకు వచ్చిన ఇంటి యజమాని ఇద్దరినీ విడదీసి గొడవను ఆపాడు.
సంఘటన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి యత్నించిన భర్తను చంపేస్తానని భార్య బెదిరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, భర్త కూడా మద్యం మత్తులో ఉండటంతో జరిగిన వాగ్వాదంలో ఆత్మరక్షణ కోసమే భార్య ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Leave a Reply