“ఛీఛీ! కాలుజారి పడితే ఎవరూ ముద్దులు పెట్టుకోరు!”.. షాపింగ్ మాల్‌లో జరిగిన దారుణం.. సీసీటీవీ దృశ్యాలతో అడ్డంగా దొరికిన పారిశుధ్య కార్మికుడు..!!!

ముంబై బోరివలి వెస్ట్‌లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

సదరు మాల్‌లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రితేష్ అముల్లా అనే వ్యక్తి, గత 2025 సెప్టెంబర్ నెలలో దుకాణంలో విధులు నిర్వహిస్తున్న యువతి వద్దకు వచ్చి వాష్‌రూమ్ ఎక్కడంటూ దారి అడిగాడు. ఆమె దారి చూపించినప్పటికీ మళ్లీ వెనక్కి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

ఆమె అతడిని వారించి బిల్లింగ్ కౌంటర్ వైపు వెళ్తుండగా, వెనుకనుంచి వేగంగా వచ్చిన ఆ దుండగుడు హఠాత్తుగా ఆమెను బలవంతంగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను కిందకు తోసి, రెండోసారి కూడా ఆమెపై పడి ముద్దుపెట్టుకుంటూ లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. దీన్ని గమనించిన తోటి మాల్ సిబ్బంది, సాధారణ ప్రజలు వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలీసులు లోతైన దర్యాప్తు జరిపి సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్ష్యాలను పక్కాగా సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణ సందర్భంగా.. తాను ప్రమాదవశాత్తు కాలుజారి ఆమెపై పడిపోయానంటూ నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఎవరైనా కాలుజారి పడితే అది ఎదుటివారిని ముద్దుపెట్టుకోవడంతో ముగియదు” అంటూ ఘాటుగా మొట్టికాయలు వేసింది. నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద దోషికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ కేసు విచారణను పూర్తి చేసి బాధితురాలికి సత్వర న్యాయం అందించడంపై నెటిజన్లు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Posted

in

by

Tags: