మానవత్వం మరియు చట్టంపై మరోసారి గొడ్డలి దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక మహిళపై జరిగిన ఘోరమైన దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గడ్డకట్టే చలిలో ఒక మహిళను బహిరంగంగా స్తంభానికి కట్టేసి, ఆమెపై బకెట్లతో నీళ్లు పోస్తూ కొందరు మతోన్మాదులు అమానవీయంగా ప్రవర్తించారు.
ఆ మహిళ బాధతో విలవిలలాడుతుంటే, నిందితులు మాత్రం కేరింతలు కొడుతూ ఆనందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన అద్దం పడుతోంది.
అసలేం జరిగింది? బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఘటన జనవరి 2న ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలో ఉన్న నద్దా మోరల్ బజార్లో జరిగింది. దొంగతనం చేసిందనే ఆరోపణతో మొదట ఆ మహిళను పట్టుకున్నారు. ఆ తర్వాత చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న అల్లరిమూకలు, ఆమెను స్తంభానికి కట్టేసి చలిలో ఆమెపై నీళ్లు పోస్తూ హింసించారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
నిందితులు ఎవరు? పోలీసుల కథనం ప్రకారం.. అరెస్టయిన వారిలో ఒక మదర్సాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు (లోక్మాన్ మరియు ఏక్రామ్) మరియు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మదర్సా నిర్వాహకుల వివరణ ప్రకారం.. తెల్లవారుజామున ఒక టీచర్ గదిలోని పంజాబీ జేబులో ఆ మహిళ చేయి పెడుతుండగా విద్యార్థులు చూశారు. వారు అరవడంతో టీచర్లు వచ్చి ఆమెను పట్టుకున్నారు. తెల్లవారుజామున పోలీసులు అందుబాటులో ఉండరనే నెపంతో తామే స్వయంగా శిక్ష వేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.
ఈ ఘటన కేవలం ఒక మహిళపై జరిగిన దాడి మాత్రమే కాదు, సమాజం మరియు వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమని పౌర సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
