ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ కాంపియర్‌గంజ్ ప్రాంతంలోని ఓ కంప్యూటర్ శిక్షణా కేంద్రంలో, అదనపు తరగతుల (స్పెషల్ క్లాస్) పేరుతో విద్యార్థినిని ఒంటరిగా ఉంచిన ఉపాధ్యాయుడు జగదీష్ చౌరాసియా ఆమెపై అనుచితంగా ప్రవర్తించాడు.
ఆ విద్యార్థినిని సదరు టీచర్ బలవంతంగా ముద్దుపెట్టుకున్నట్లు ఆరోపణలు రాగా, ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం నాడు చోటుచేసుకుంది. రోజూ జరిగే తరగతులు ముగిసినప్పటికీ బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.
వెంటనే బాధిత బాలిక సోదరుడు తన స్నేహితులతో కలిసి సదరు కంప్యూటర్ సెంటర్‌కు చేరుకున్నాడు. తరగతి గదిలోకి ప్రవేశించిన సోదరుడు.. తరగతులు ముగిశాక కూడా తన చెల్లెలిని ఎందుకు ఒంటరిగా కూర్చోబెట్టారంటూ నిలదీసి, తీవ్ర ఆగ్రహంతో ఆ టీచర్‌పై పిడిగుద్దులు కురిపించి దేహశుద్ధి చేశాడు. ఈ ఘర్షణ తాలూకు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన టీచర్.. ఆ విద్యార్థిని తనకు సోదరి లాంటిదని, రక్షాబంధన్ రోజున తనకు రాఖీ కట్టిందని, అందువల్లే అదనపు తరగతులు తీసుకున్నానని బుకాయించే ప్రయత్నం చేశాడు.
బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు నిందితుడు జగదీష్ చౌరాసియాను పోలీసులు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్న ఆ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ ఘటనపై, నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply