గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ జిల్లాలో మూగజీవమైన ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
సుమారు రెండేళ్ల వయసున్న ఆవు కనిపించకపోవడంతో యజమాని వెతుకుతుండగా.. సమీపంలోని శ్మశానవాటిక పరిసరాల్లో ఓ వ్యక్తి ఆవుతో కలిసి అసహజ రీతిలో ఉండటాన్ని గమనించినట్లు సమాచారం. అది చూసి యజమాని ఒక్కసారిగా నిర్ఘాంతపోగా.. అతడిని చూసిన ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
ఈ అకృత్యానికి పాల్పడింది రాజ్కోట్ జిల్లాకు చెందిన కనుభాయ్ గోండలియాగా పోలీసులు గుర్తించారు. ఆవు యజమాని మెర్కీభాయ్ చావ్డా తన మూగజీవం కనిపించక పలుచోట్ల గాలిస్తున్న సమయంలో ఈ అఘాయిత్యం కంటపడినట్లు పేర్కొన్నారు. అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో ఘటనా స్థలంలో ఉన్న మరో వ్యక్తి అక్కడి దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో ఆ వీడియో కీలకమైన ఆధారంగా మారిందని, దాని ఆధారంగా కూడా లోతైన విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ఈ ఉదంతంపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆవుకు జరిగిన శారీరక గాయాలు, నష్టంపై పశువైద్యుల ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. నిందితుడి మానసిక స్థితి, నేర నేపథ్యం తదితర అంశాలపై దర్యాప్తు సాగుతోంది. మరోవైపు, మూగజీవాలపై సాగే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
