చెన్నై బ్యూరో: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయకన్’ విడుదల కాకముందే ఇంటర్నెట్లో లీక్ అవ్వడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో సందడి చేయాల్సిన సినిమా.. ఎడిటింగ్ టేబుల్ పై ఉండగానే బయటకు రావడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
కేవలం నలుగురికే తెలిసిన సీక్రెట్: ఇంటర్నెట్లో ప్రత్యక్షమైన వీడియోను గమనిస్తే, అందులో ‘ఎడిట్ మార్క్స్’ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇది ఫైనల్ వెర్షన్ కాదు, ఎడిటింగ్ సమయంలో వాడే ‘రా కట్’ (Raw Cut). సాంకేతికంగా ఇటువంటి ఫుటేజీ కేవలం నలుగురి వద్ద మాత్రమే ఉంటుంది: దర్శకుడు, హీరో, నిర్మాత మరియు ఎడిటర్. అత్యంత భద్రత మధ్య ఉండాల్సిన ఈ ఫైల్ బయటకు వచ్చిందంటే.. ఇది బయటి వ్యక్తులు చేసిన హ్యాకింగ్ కాదని, ఇండస్ట్రీ లోపల ఉన్నవారే కావాలని లీక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విజయ్ కోసం విశాల్ ఆవేదన: ఈ దారుణంపై నటుడు విశాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. “ఒక సినిమా వెనుక ఎంతోమంది కష్టం, సమయం, అంకితభావం ఉంటాయి. ‘జననాయకన్’ క్లిప్స్ లీక్ అవ్వడం చూస్తుంటే మనసు ముక్కలవుతోంది. గత 20 ఏళ్లుగా విజయ్ సినిమాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తున్న అభిమానిగా.. ఈ సినిమాను కూడా వెండితెరపైనే చూడాలని కోరుకుంటున్నాను. సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమైనా సరే, చట్టబద్ధంగా సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి” అంటూ విశాల్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
రంగంలోకి దిగిన జీవా: మరోవైపు నటుడు జీవా స్పందిస్తూ.. పైరసీని ప్రోత్సహించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. “ఒక సినిమా రూపుదిద్దుకోవడానికి రక్తం, చెమట చిందిస్తారు. ఇటువంటి లీకులు ఆ శ్రమను అవమానించడమే. సినిమాను థియేటర్లలోనే చూసి విజయ్‌కు మద్దతు తెలపండి” అని కోరారు.
అసలు భయం అదేనా? సాధారణంగా సినిమాలు విడుదలైన తర్వాత పైరసీ బారిన పడతాయి. కానీ ‘జననాయకన్’ విషయంలో షూటింగ్ దశలోనే వీడియోలు బయటకు రావడం సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ లీకేజీకి బాధ్యులెవరు? కేవలం నలుగురికి మాత్రమే యాక్సెస్ ఉన్న ఫైల్ ఎలా లీక్ అయింది? అన్న కోణంలో చిత్ర యూనిట్ అంతర్గత విచారణ చేపట్టింది.
ఏది ఏమైనా, విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘జననాయకన్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లీకేజీ వ్యవహారం కోలీవుడ్ సెక్యూరిటీ సిస్టమ్‌నే ప్రశ్నిస్తోంది.
