చెన్నై క్రైమ్ న్యూస్: చెన్నైలో 22 ఏళ్ల యువకుడిని వెంటాడి వేటాడి నరికి చంపిన ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ దారుణ హత్య వెనుక ఇద్దరు మహిళలు మాస్టర్ ప్లాన్ వేశారని తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు.
ముగ్గురి మధ్య ప్రేమాయణం: చెన్నై పల్లవరం సమీపంలోని త్రిశూలం అమ్మన్ నగర్‌కు చెందిన సెల్వకుమార్ (22) కూలీ పనులకు వెళ్లేవాడు. ఇతడికి పచ్చయమ్మన్ కోవెల వీధికి చెందిన రీనా (24) అనే వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త పనికి వెళ్లిన సమయంలో వీరిద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. అయితే సెల్వకుమార్ రీనాతోనే ఆగకుండా, ఆమె ప్రాణ స్నేహితురాలు రజిత (25)తో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో అతను వ్యవహారాన్ని నడిపించాడు. కొంతకాలానికి ఈ విషయం రీనాకు తెలిసింది. దీనిపై ఆమె సెల్వకుమార్‌ను నిలదీయగా, “మీరిద్దరూ నా రెండు కళ్లలాంటి వారు, ఇద్దరూ కావాలి” అంటూ సినిమా స్టైల్లో సమాధానం ఇచ్చాడు.
విచారణలో బయటపడ్డ ‘హనీ ట్రాప్’ దందా: పోలీసుల విచారణలో రీనా, రజితలకు సంబంధించిన అసలు నిజాలు బయటపడ్డాయి. వీరు సామాన్య మహిళలు కారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువకులను ఆకర్షించి, వారితో ఏకాంతంగా గడిపి, ఆపై బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే ‘హనీ ట్రాప్’ గ్యాంగ్‌గా వీరు పనిచేస్తున్నారు. సెల్వకుమార్‌తో కూడా డబ్బు కోసమే వీరు స్నేహం చేశారు. అయితే ఒక దశలో విషయం అర్థమైన సెల్వకుమార్, వారికి డబ్బు ఇవ్వడంలో పేచీ పెట్టడం మొదలుపెట్టాడు.
కిరాతక హత్యకు స్కెచ్: ఇక సెల్వకుమార్ వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా అతడి వల్ల ప్రమాదం పొంచి ఉందని భావించిన ఈ ఇద్దరు స్నేహితురాళ్లు అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. గత బుధవారం రాత్రి ‘ఏకాంతంగా మాట్లాడుకుందాం’ అని నమ్మించి అతడిని పల్లవరం శుభం నగర్ పార్కుకు పిలిపించారు. అతడు అక్కడికి వెళ్లగానే, అప్పటికే సిద్ధంగా ఉన్న మరో నలుగురు మగ స్నేహితులతో కలిసి సెల్వకుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.
నాటకమాడిన రీనా: కత్తులతో అతడి తల, ముఖం మరియు జననేంద్రియంపై కిరాతకగా దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత, ఇది ఏదో దోపిడీ ముఠా చేసిన హత్యగా చిత్రీకరించడానికి రీనా అక్కడే స్పృహతప్పి పడిపోయినట్లు నాటకమాడింది. తీవ్ర గాయాలైన సెల్వకుమార్ రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ముగ్గురి అరెస్ట్: పోలీసుల విచారణలో రీనా, రజితలు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వీరికి సహకరించిన 17 ఏళ్ల మైనర్ బాలుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
