విదేశీ ప్రయాణం అనేది కేవలం పర్యాటక అనుభవం మాత్రమే కాదు, అది మన దేశ గౌరవాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఆ దేశ ప్రజల ముందు ఉంచే ఒక పరీక్ష. అయితే, ఇటీవల జపాన్‌లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఒక భారతీయ మహిళ జపాన్‌లోని ఒక ‘సౌవెనీర్’ (జ్ఞాపికల) దుకాణంలో వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించింది. దొంగతనానికి పాల్పడుతుండగా పట్టుబడిన తర్వాత, ఆమె డబ్బులు ఇచ్చి ఆ విషయాన్ని అక్కడితో ముగించాలని చూడటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన భారతీయ పర్యాటకుల పట్ల ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుకాణంలో పట్టుబడ్డ మహిళ: ఒక టూర్ గ్రూప్‌తో కలిసి వెళ్లిన ఆ మహిళ, తనతో పాటు ప్రయాణిస్తున్న మిగతా వారికి తెలియకుండా ఈ పనికి పాల్పడింది. జపాన్‌లోని ఒక దుకాణంలో ఆమె వస్తువులను దొంగిలిస్తుండగా దుకాణ యజమాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పట్టుబడిన వెంటనే, తప్పు ఒప్పుకోవడానికి బదులుగా.. ఆ మహిళ డబ్బులు ఇచ్చి కేసును బయటకు రాకుండా చూసే ప్రయత్నం చేసింది. కానీ యజమాని అందుకు ససేమిరా ఒప్పుకోలేదు.
‘ఇది హై-ట్రస్ట్ సొసైటీ’: “జపాన్ ఒక ‘హై-ట్రస్ట్ సొసైటీ’ (అత్యంత నమ్మకమైన సమాజం). ఇక్కడ దొంగతనాలు వంటివి చాలా అరుదు” అని దుకాణ యజమాని అసహనం వ్యక్తం చేశారు. తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడగకుండా, డబ్బుతో కేసును పక్కదారి పట్టించాలని చూడటం అతనికి మరింత బాధను కలిగించింది. దీంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీస్ స్టేషన్లోనూ అదే పొరపాటు: పోలీసుల విచారణలో కూడా సదరు మహిళ అదే పని చేసింది. కేసును పరిష్కరించడానికి డబ్బులు ఆశ చూపింది. అయితే జపాన్ వంటి క్రమశిక్షణ గల దేశంలో ఇలాంటి లంచగొండితనం, అనైతిక ప్రవర్తనను ఏమాత్రం సహించరు. పోలీసులు ఆమెకు అక్కడి చట్టాల తీవ్రతను వివరించి, కఠినంగా హెచ్చరించారు. చివరికి ఆమెను హెచ్చరించి వదిలిపెట్టినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో విమర్శలు: ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఇలాంటి పనులు మొత్తం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయి,” అని ఒకరు, “విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నిబంధనలను గౌరవించడం బాధ్యత” అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. జపాన్ ప్రజల క్రమశిక్షణ, నిజాయితీని నెటిజన్లు కొనియాడుతున్నారు.
