అస్సాం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాన్వాయ్ వెళ్లడం కోసం, రోగితో వెళ్తున్న ఒక అంబులెన్స్‌ను రామ్‌నగర్ ఐఎస్బిటి (ISBT) ప్రాంతంలో పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు మరియు సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర దిగ్భ్రాంతి, విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ వీడియో దావానలంలా వ్యాపించడంతో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందించారు. “అత్యవసర వైద్య సహాయం అవసరమైన వ్యక్తి ప్రాణం కంటే ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణం ఎప్పుడూ ముఖ్యం కాదు; వీఐపీ ప్రయాణాలు సామాన్యులకు, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించకూడదు” అని పేర్కొంటూ ఆయన బహిరంగంగా క్షమాపణలు కోరారు. అంతేకాకుండా, ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించామని, తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేసిన వెంటనే, అంబులెన్స్‌ను అడ్డుకున్న శ్రీకోనా పోలీస్ పాయింట్ ఇన్ఛార్జ్ బిజోయ్ గోస్వామి, నేషనల్ హైవే పోలీస్ పాయింట్ ఎస్సై శివశంకర్ దాస్‌తో సహా మొత్తం 4 గురు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా స్వయంగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని చర్యలు తీసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా విశేష దృష్టిని ఆకర్షించింది.

Leave a Reply