అడవిలో కేవలం బలానికి మాత్రమే విలువ ఉంటుంది, జాలికి కాదు. వృద్ధాప్యంలో సింహం, పులి వంటి అత్యంత శక్తివంతమైన జంతువులు సైతం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడవలసిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి ఘటనే ఒక ముసలి చిరుతపులికి ఎదురైంది. అది నదిని దాటుతున్న ఒక అద్భుతమైన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
వృద్ధాప్యం కారణంగా నడవడానికే ఇబ్బంది పడుతూ.. ఎంతో శ్రమతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ, రాళ్ల గుండా నదిని దాటడానికి ఆ చిరుతపులి ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో, నీటిలో మాటువేసి దాగి ఉన్న ఒక మొసలి అకస్మాత్తుగా ఆ చిరుతపులిపైకి దూకి ప్రాణాంతక దాడి చేసింది.
అయితే, ఎవరూ ఊహించని విధంగా.. ఆ ముసలి చిరుతపులి మెరుపు వేగంతో అత్యంత ఎత్తుకు గాల్లోకి ఎగిరి (జాంప్ చేసి), మొసలి నోటికి చిక్కకుండా తృటిలో తన ప్రాణాలను కాపాడుకుంది.
నెటిజన్లను ఆశ్చర్యపరిచిన చిరుత సామర్థ్యం:
‘latestkruger’ అనే ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలో భాగస్వామ్యం చేయబడిన ఈ ఒళ్ళు గగుర్పొడిచే వీడియోను ఇప్పటివరకు 7 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. కనీసం సరిగ్గా నడవడానికే కష్టపడుతున్న ఒక ముసలి జంతువు.. అంత ఎత్తుకు ఎలా దూకగలిగింది అని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి, చిరుతపులికి ఉండే బలమైన కండరాలు, వంగే గుణమున్న వెన్నెముక మరియు అత్యంత శక్తివంతమైన వెనుక కాళ్లే దీనికి ప్రధాన కారణం. వయసు పైబడి శరీరం సహకరించకపోయినా, ఒక వేట జంతువు తనను తాను ఎలా కాపాడుకోవాలో ఎప్పటికీ మర్చిపోదని ఈ చిరుతపులి నిరూపించింది.
ఈ అద్భుతమైన వీడియోను చూసిన నెటిజన్లు.. ఆ వృద్ధ చిరుతపులి ప్రదర్శించిన చురుకుదనాన్ని, వేగాన్ని చూసి ముక్కున వేలేసుకుంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
