ప్రధాని మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) ప్రసంగంలో మాట్లాడుతూ.. ఈ ఉద్యమం ఆధ్యాత్మికత యొక్క పవిత్రతను కాపాడుతూనే, ఆధునికతను అందంగా మేళవిస్తోందని కొనియాడారు.
సంప్రదాయాన్ని విస్మరించకుండా, కొత్త తరం తమదైన శైలిలో భక్తిని చాటుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు. శతాబ్దాలుగా భజనలు, కీర్తనలు భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక పునాదిగా ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. ఆలయాలు, కథలు మరియు తరతరాలుగా వస్తున్న ఈ భక్తి సంప్రదాయం ప్రతి కాలంలోనూ కొత్త రూపు దాల్చుకుంటూ ప్రజలను ఏకం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
నేటి యువత తమ దైనందిన జీవితంలో భక్తి భావాన్ని జోడిస్తున్నారని, ఆ మనస్తత్వమే ‘భజన్ క్లబ్బింగ్’ వంటి కొత్త సంస్కృతికి కారణమని ప్రధాని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ప్రస్తావిస్తూ.. అక్కడి వేదిక, విద్యుత్ దీపాలు, సంగీతం అన్నీ ఒక మ్యూజిక్ కాన్సర్ట్లా ఉన్నప్పటికీ, అక్కడ పూర్తి భక్తితో భజనలు ఆలపించడాన్ని ఆయన ప్రశంసించారు.
భజనల గౌరవం, పవిత్రత ఎక్కడా తగ్గలేదని.. పదాల పవిత్రత లేదా భావాల లోతు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఆయన అన్నారు. భక్తిని ఆధునికతతో జోడించే ఈ ప్రయత్నం హర్షణీయమని తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో ప్రాచుర్యం పొంది, అమెరికాకు కూడా పాకిన ఈ ‘భజన్ క్లబ్బింగ్’ యువతలో వేగంగా ఆదరణ పొందుతోంది. లైవ్ మ్యూజిక్, లైటింగ్, ఉత్సాహభరితమైన వాతావరణంతో సంప్రదాయ భజనలు కొత్త రూపంలో అలరిస్తున్నాయి. ఆధ్యాత్మికత మరియు ఆధునిక జీవితం కలిసి ప్రయాణించగలవని ఈ ధోరణి నిరూపిస్తోంది.
