ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు, తన ఐదేళ్ల నాటి ప్రియురాలిని కలుసుకోవడం కోసం జేబులో కేవలం ₹50 మాత్రమే పెట్టుకుని, వందల కిలోమీటర్లు దాటి బీహార్‌కు ప్రయాణించిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. ప్రేమపై ఉన్న గుడ్డి నమ్మకంతోనే అతడు ఈ సాహసోపేతమైన (వెర్రి) ప్రయాణానికి ఒడిగట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఎట్టకేలకు బీహార్ చేరుకున్న ఆ యువకుడు, ప్రియురాలి ఇంటిని వెతికేందుకు ఓ ఆటో ఎక్కాడు.
నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నాక ఆటో డ్రైవర్ చార్జీ అడగ్గా, ఆ యువకుడు తన జేబులో ఉన్న ₹50 మాత్రమే తీసి ఇచ్చాడు. ఆటోకి కావాల్సిన పూర్తి కిరాయి చెల్లించకపోవడంతో డ్రైవర్‌కు, యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. గొడవ పెద్దదవడంతో స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
పోలీసులు విచారించగా.. తాను ఉత్తరప్రదేశ్ నుంచి తన ఐదేళ్ల నాటి ప్రేయసిని వెతుక్కుంటూ వచ్చానని, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆటో చార్జీ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నానని ఆ యువకుడు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు.
అసలు విషయం తెలుసుకుని అవాక్కయిన పోలీసులు, స్థానికులు.. ఆ యువకుడి ప్రియురాలి వివరాలు సేకరించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జేబులో డబ్బుల్లేకపోయినా ప్రేమ కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చిన ఈ యువకుడి ప్రేమకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
