టాటా ఎలక్ట్రానిక్స్‌పై సైబర్ దాడి: డార్క్ వెబ్‌లో 630GB డేటా లీక్.. ఆపిల్, టెస్లా రహస్య పత్రాలు బహిర్గతం!

బెంగళూరు: భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ‘టాటా ఎలక్ట్రానిక్స్’ సంస్థపై భారీ సైబర్ దాడి (Cyber Attack) జరిగింది. తమ కంప్యూటర్ నెట్‌వర్క్‌పై సైబర్ దాడి జరిగినట్లు టాటా ఎలక్ట్రానిక్స్ అధికారికంగా ధృవీకరించింది. అయితే, ఈ దాడిలో సంస్థకు చెందిన 2 లక్షలకు పైగా అత్యంత కీలకమైన పత్రాలు డార్క్ వెబ్ (Dark Web) లో లీక్ అయినట్లు సమాచారం వెలువడటం ఇప్పుడు ప్రపంచ పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది?
తమ కంప్యూటర్ సిస్టమ్స్‌లో సైబర్ దాడి జరిగినట్లు గుర్తించిన వెంటనే భద్రతా ప్రోటోకాల్స్‌ను యాక్టివేట్ చేశామని టాటా ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఈ ఘటన వల్ల కంపెనీ ఉత్పత్తి లేదా వాణిజ్య కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని సంస్థ స్పష్టం చేసింది.

అయితే, సైబర్ సెక్యూరిటీ నిపుణుల సమాచారం ప్రకారం.. ‘వరల్డ్ లీక్స్’ (World Leaks) అనే హ్యాకర్ల ముఠా, టాటా ఎలక్ట్రానిక్స్ నుండి దొంగిలించిన సుమారు 630 జీబీ (GB) కంటే ఎక్కువ డేటాను డార్క్ వెబ్‌లో ఉంచింది. ఈ డేటాలో దాదాపు 2,04,000 కు పైగా ముఖ్యమైన ఫైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆపిల్, టెస్లా రహస్యాలు కూడా లీక్ అయ్యాయా?
ఈ సైబర్ దాడిలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. టాటా ఎలక్ట్రానిక్స్ యొక్క ప్రధాన అంతర్జాతీయ క్లయింట్లు అయిన ఆపిల్ (Apple) మరియు టెస్లా (Tesla) సంస్థలకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు కూడా లీక్ అయినట్లు సమాచారం వస్తోంది.

డార్క్ వెబ్‌లో లీక్ అయిన డేటాలో “com.apple.factorydata”, “material specification” వంటి పేర్లతో ఉన్న ఫైళ్లను నిపుణులు గుర్తించారు. కొన్ని పత్రాలపై “ఆపిల్ సంస్థ యొక్క అత్యంత రహస్య మరియు యాజమాన్య సమాచారం” (Apple Confidential & Proprietary) అనే నోట్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా, టెస్లా కంపెనీకి చెందిన ప్రసిద్ధ ‘మోడల్-వై’ (Model-Y) వాహనంలో ఉపయోగించే ‘చార్జింగ్ కంట్రోల్ సిస్టమ్’ కు సంబంధించిన పత్రాలు, “ట్రేడ్ సీక్రెట్” (Trade Secret) అని పేర్కొన్న కొన్ని సాంకేతిక బ్లూప్రింట్లు (డిజైన్లు) కూడా లీక్ అయినట్లు వెల్లడైంది.

ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం సైతం విక్రయం:
సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుల పరిశీలన ప్రకారం.. కేవలం సాంకేతిక పత్రాలు మాత్రమే కాకుండా, గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఈమెయిల్ సంభాషణలు, ఉద్యోగుల రికార్డులు మరియు భారతీయ ఉద్యోగులతో పాటు విదేశీ ఉద్యోగుల పాస్‌పోర్ట్ కాపీలు కూడా ఈ డేటా లీక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం సాంకేతిక సమాచార లీక్ మాత్రమే కాకుండా, వేలాది మంది వ్యక్తిగత డేటా భద్రతను (Privacy) కూడా ప్రశ్నార్థకం చేసింది.

రంగంలోకి దిగిన ఆపిల్ – దర్యాప్తు ప్రారంభం!
ఈ సైబర్ దాడి ఉదంతంపై ఆపిల్ సంస్థ అంతర్గతంగా సొంతంగా విచారణ ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. డేటాను తిరిగి ఇవ్వడానికి హ్యాకర్లు టాటా సంస్థను భారీగా రెంసమ్ (కప్పం/డబ్బు) డిమాండ్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై టాటా ఎలక్ట్రానిక్స్ గానీ, టెస్లా సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఆపిల్‌కు టాటా అత్యంత కీలక భాగస్వామి:
చైనా వెలుపల తన ఐఫోన్ల తయారీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని చూస్తున్న ఆపిల్ సంస్థకు, టాటా ఎలక్ట్రానిక్స్ అత్యంత కీలకమైన భాగస్వామిగా అవతరించింది. ప్రస్తుతం భారతదేశంలో తయారవుతున్న ఐఫోన్లలో దాదాపు మూడింట ఒక వంతు (1/3rd) టాటా సంస్థకు చెందిన ప్లాంట్లలోనే తయారవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని హోసూర్ లో ఉన్న టాటా ఐఫోన్ తయారీ కేంద్రానికి సంబంధించిన పత్రాలు కూడా లీక్ అయిన డేటాలో ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ చేదు అనుభవం:
గత ఏడాది కూడా టాటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్’ (JLR) పై పెద్ద ఎత్తున సైబర్ దాడి జరిగింది. ఆ సమయంలో దాదాపు ఆరు వారాల పాటు కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది.

భారత రంగానికి ఇది ఒక హెచ్చరికా?
భారతదేశం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా (Global Manufacturing Hub) ఎదుగుతున్న తరుణంలో, టాటా ఎలక్ట్రానిక్స్‌పై జరిగిన ఈ సైబర్ దాడి ఒక పెద్ద హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. ఆపిల్, టెస్లా, ఇంటెల్, క్వాల్కమ్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలతో కలిసి పనిచేసే భారతీయ సంస్థలకు.. సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం ఐటీ సమస్య మాత్రమే కాదని, అది వ్యాపార నమ్మకాన్ని, ఉనికిని శాసించే అత్యంత కీలకమైన అంశమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.


Posted

in

by

Tags: